‘తేజస్’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

25 Nov, 2013 00:05 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి :  వార్తల సేకరణలో పెరిగిన వేగానికి అనుగుణంగా తేజస్ కార్యకలాపాలతో వెబ్‌సైట్ రూపకల్పన శుభపరిణామమని గవర్నర్ కే రోశయ్య ప్రశంసించారు. తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తేజస్, చెన్నై) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కాలంలోని వేగంతోపాటు పాత్రికేయుల పాత్ర కూడా వేగవంతమైందని చెప్పారు. 1952లో కార్బన్ కాపీపై వార్త రాసి విలేకరికి అందజేస్తే వారం, పది రోజులకు పత్రికలో ప్రచురితమయ్యేదని గుర్తుచేశారు. ఈ జాప్యాన్ని కాలదోషంగా భావించకుండా ఎంతో సంతోషించే వారమన్నారు. నేడు సభ జరుగుతుండగానే వార్తలు పంపేయడం, మీడియాలో ప్రసారం కావడం కూడా పూర్తవుతోందని చెప్పారు.

నేటి వార్త మరుసటిరోజు రాకుంటే కాలదోషం పట్టినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ యుగం తో పోటీపడుతున్నట్లుగా తేజస్ ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించుకోవడం, దాన్ని రాజ్‌భవన్‌లో తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందకరమన్నారు. తనకు కనీసం సెల్‌ఫోన్ వినియోగించడం కూడా రాదని తెలిపారు. మాట్లాడడం మినహా ఆన్ ఆఫ్‌లు కూడా సహాయకులు చేస్తారని వివరించారు. భవిష్యత్తులో తమవంటి వారికి తేజస్ వెబ్‌సైట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తమిళనాడు నుంచి వెలువడుతున్న తెలుగు వార్తా పత్రికల్లో తెలుగుదనాన్ని మరింతగా పెంచాలని సూచించారు. విషయ సేకరణను పెంచి పాఠకులకు అందించాలని ఒక పాఠకునిగా కోరుతున్నానని అన్నారు. తేజస్ సభ్యుల సంక్షేమ నిధికి రూ 2 లక్షల భూరి విరాళాలు ప్రకటించిన పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, రూ లక్షకు హామీ ఇచ్చిన జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ టీ రాజశేఖర్‌ను, వెబ్‌సైట్ రూపకర్త భాస్కర్‌రెడ్డిని, తేజస్ బృందాన్ని గవర్నర్ అభినందించారు.

తేజస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపునకు 12వ తరగతి కారణమైనట్లే, తేజస్ సైతం 12 ఏళ్ల ప్రస్తానా న్ని దాటేటప్పుడు వెబ్‌సైట్‌ను సిద్ధం చేసుకుందన్నారు. తమిళనాడులో పనిచేసే తెలుగు జర్నలిస్టుల వివరాలు, తేజస్ కార్యకలాపాలను ప్రపంచానికి చాటేలా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. మంచి మనస్సు కలిగిన మచ్చలేని రాజకీయవేత్త రోశయ్య చేతుల మీదుగా వెబ్‌సైట్ ఆవిష్కరించుకోవడం తమకు సంతోషదాయకమన్నారు. విలేకరులకు కూడా విమర్శలేగానీ సుఖమయ జీవితం, జీతం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తేజస్ సభ్యుల సంక్షేమం కోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి మృతి చెందిన విలేకరి కుటుంబానికి బీమా ద్వారా రూ 5 లక్షలు అందజేయనున్నామని ప్రకటించారు. సభ్యుల సంక్షేమం కోసం తేజస్‌ను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తేజస్‌కు ఊపిరిగా నిలుస్తున్న కే సుబ్బారెడ్డి, ఆరోగ్య సంజీవని వలె అండగా ఉన్న ‘ఉంగళుక్కాగ’ సునీల్ తదితరుల సహకారం మరువలేనిదని అన్నారు.

తేజస్ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ చేస్తూ శాశ్వత నిధికి విరాళాలు అందించిన కల్పవృక్ష చారిటబుల్ ట్రస్ట్ (రూ 1 లక్ష), సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ (జీవితాంతం ఏడాదికి రూ 10 వేలు), తేజస్ సభ్యురాలు ఎన్ అరుణశ్రీ (రూ 25 వేలు)లకు, సభకు హాజరైన ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రముఖులు పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సునీల్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు చిరంజీవి, పెరియార్ వర్సిటీ సెనేట్ సభ్యులు తంగుటూరి రామకృష్ణ, గొల్లపల్లి ఇజ్రాయల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు