ఉమ్మడి వాటాలో మాకు దక్కేది సున్న: తెలంగాణ

17 Nov, 2016 19:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేవలం ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కృష్ణా జలాల వాటా నుంచి పంచుకుంటే తమకు దక్కేదేమీ ఉండదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆవేదన వ్యక్తంచేసింది. కృష్ణా నదీ జలాలను తిరిగి నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించాలని దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఏడాది కాలంగా విచారణ కొనసాగుతున్న తెలిసిందే. తాజాగా గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి ఈ అంశంపై తాజా పరిస్థితిని వివరించారు. ఈ అంశంపై ఇటీవల జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం నీటి పంపిణీ కేవలం రెండు కొత్త రాష్ట్రాల మధ్యేనని, కర్ణాటక, మహారాష్ట్రలకు వీటితో సంబంధం లేదని తీర్పు ప్రకటించిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ స్పందిస్తూ ‘ఉమ్మడి వాటా నుంచి పంచితే మాకు దక్కేదేమీ ఉండదు. మా న్యాయమైన వినతిని ఏనాడూ ట్రిబ్యునల్ ముందు వినిపించలేక పోయాం. వినిపించే అవకాశం ఇవ్వాలని, అందుకు వీలుగా కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారానైనా, లేదా ఉన్న ట్రిబ్యునల్ ద్వారానైనా అవకాశం కల్పించాలని రాష్ట్ర విభజన అనంతరం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం-1956 ప్రకారం కేంద్రానికి విన్నవించాం. కానీ కేంద్రం పరిష్కరించలేదు. అందువల్ల సుప్రీం కోర్టును ఆశ్రయించాం. తెలంగాణ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి పరిశీలన లేకుండా ఉమ్మడి రాష్ట్ర వాటా నుంచే పంచుకోవాలని అంటే ఎలా? నదీ పరివాహక ప్రాంతంలో కర్నాటక, మహారాష్ట్ర, ఏపీకి ఉన్న హక్కులు మాకూ ఉంటాయి..’ అని పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది నారీమన్ స్పందిస్తూ ట్రిబ్యునల్ తీర్పు అనంతరం ఈ వివాదంతో ఇక కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కేసు విచారణను 2017 జనవరి 18కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు