కొత్త కొట్లాట

28 Oct, 2016 12:48 IST|Sakshi
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధి ఓ చోట.. 
పాలనా కేంద్రం మరోచోట
జిల్లాలోని మూడు ప్రాంతాల్లో 
కేంద్రం కోసం ఆందోళనలు
నర్సంపేట, పరకాల, గీసుకొండల్లో విడివిడిగా ఉద్యమాలు
మొదటి ముసాయిదా మార్చినప్పటి నుంచే రగడ
తూర్పు నియోజకవర్గాన్నిరూరల్‌లో కలిపితే 
అందరికీ ఆమోదయోగ్యం!
 
సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్నిచోట్ల సరికొత్త పంచాయితీలకు తెరతీసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21జిల్లాలు చేయడంతో జిల్లాల సంఖ్య మొత్తం 31కి చేరుకుంది. దీన్ని ప్రజలు ఆమోదించినప్పటికీ వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మాత్రం విభిన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో జిల్లాలో గందరగోళ వాతావరణం నెలకొంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న 15 మండలాల్లోని మూడు ప్రాంతాల్లో జిల్లా కేంద్రం కోసం ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇందులో ఒక నియోజకవర్గంలోనే రెండు చోట్ల విడివిడిగా ఆందోళనలు చేపట్టడం విశేషం.
 
ఎక్కడా లేని పరిస్థితి
రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రెవెన్యూ పరిధిలో లేని వరంగల్‌ అర్బన్ జిల్లాలో ఉన్న హన్మకొండలో రూరల్‌ జిల్లా కలెక్టరేట్, వరంగల్‌ నగరంలో వివిధ రూరల్‌ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఒక ప్రత్యేక జిల్లా కేంద్రం లేకపోవడంతో వరంగల్‌ రూరల్‌ రెవెన్యూ జిల్లా పరిధిలోనే కలెక్టరేట్, ఇతర అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ రూరల్‌ జిల్లా పరిధిలోని మూడు ప్రాంతాల నుంచి డిమాండ్లు 
 
వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష పోరాటాలు సైతం ప్రాంరభించారు. ఇవి రోజురోజుకూ మరింత ఉధృతం దాలుస్తున్నాయి. ఒకవైపు నర్సంపేటలో జిల్లా కేంద్రం కోసం కొన్ని నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. మరోవైపు పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ వివిధ సంఘాలు ఆందోళనలు చేపట్టగా, అదే పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మరో ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ అఖిలపక్షాలు ఇప్పటికే మూడు సార్లు సమావేశాలు నిర్వహించుకుని ప్రత్యక్ష కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు విడిగా ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ కూడా అఖిలపక్షంతో కలిసి వస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు అర్బ¯ŒS జిల్లా పరిధిలోని వరంగల్‌ నగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి. రూరల్‌ జిల్లా పరిధిలోని 15మండలాల్లో గీసుకొండ, సంగెం మండలాలు నగరానికి ఆనుకుని ఉన్నాయి. దీంతో గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. గీసుకొండ మండలంలో ప్రభుత్వ భూములు సైతం అందుబాటులో ఉన్నందున ఇక్కడే కార్యాలయాలు నెలకొల్పాలనేది అఖిలపక్ష నాయకుల డిమాండ్‌.
 
’పాకాల’ జిల్లా కోసం..
జిల్లాల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాకముందునుంచే నర్సంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన మొదటి ముసాయిదాలో వరంగల్, హన్మకొండ అనే రెండు జిల్లాలు ఉండడంతో హన్మకొండ బదులు నర్సంపేటను జిల్లా కేంద్రంగా చేసి పాకాల జిల్లాగా పేరు పెట్టాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేశారు. చివరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా కార్యాలయాలు నర్సంపేటలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికీ జేఏసీ ఆందోళనలు చేస్తోంది. గతం నుంచే రెవెన్యూ డివిజ¯ŒSగా ఉన్న నర్సంపేటలో సబ్‌ డీఎఫ్‌వో కార్యాలయం, సబ్‌ కోర్టు, మినీ స్టేడియం, సమీపంలో పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు డీసీపీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేస్తుండడంతో జిల్లా కేంద్రం డిమాండ్‌ మరింత పెరుగుతోంది.
 
పరకాలలో రెండు డిమాండ్లు
చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ పరకాలలోనూ వారం కిందట ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అఖిల భారత విద్యార్ధి పరిషత్, తెలంగాణ విద్యార్ధి సంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలని, లేనిపక్షంలో రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి భూపాలపల్లి జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పరకాల ఉనికి దెబ్బతింటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు చేయడంతో పాటు, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ సైతం తగులబెట్టి పరకాల ప్రాంతం వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.ఏది ఏమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్‌ రూరల్‌ జిల్లా విషయంలో మాత్రం సరికొత్త పంచాయతీకి తెరతీసినట్‌లైంది. నర్సంపేట, పరకాల నియోజకవర్గ కేంద్రాల్లో పోరాటాలు ఎక్కడికక్కడ జరుగుతుండగా, పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ప్రత్యేకంగా మరో పోరాటం ప్రారంభం కావడం గమనార్హం.
 
‘తూర్పు’ కలిపితే ఓకే..
వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో వివిధ ప్రాంతాల మధ్య విభిన్నమైన ఆకాంక్షలు ఉన్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని రూరల్‌ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రం రగడకు తెర పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు అదే రెవెన్యూ ప్రాంతంలో ఒక పాలనా కేంద్రం ఉండడంతో పాటు జిల్లాలో నగరం చేరినట్లవుతుంది. మూడు ప్రాంతాల మధ్య జిల్లా కేంద్రం రగడకు ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉంది.
 
రెవెన్యూ డివిజన్ చేస్తే చాలు..
పోరాటల పురిటి గడ్డ, తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపకుండా పోరాడిన చరిత్ర పరకాల వాసులది. అయితే, జిల్లాల పునర్విభజనతో పరకాలకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి పరకాలను రెవెన్యూ డివిజ¯ŒSగా మార్చాలి. ఆ తర్వాత రూరల్‌ జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటుచేసినా మాకు అభ్యంతరం లేదు.
కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకుడు, పరకాల    
 
’తూర్పు’ను జిల్లా కేంద్రం చేయాలి
వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని వరంగల్‌ అర్బన్ జిల్లా నుంచి విడదీసి రూరల్‌ జిల్లాలో చేర్చి జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుంది. దీంతో జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే వివాదాలు, ఆందోళనలు సమసిపోతాయి. లేదంటే మా రెండో డివిజ¯ŒS ప్రాంతాన్ని వరంగల్‌ అర్బ¯ŒS జిల్లాలోనే చేర్చాలి. అప్పటి వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి.
ఆడెపు రమేశ్, జేఏసీ కన్వీనర్, మొగిలిచర్ల
 
‘తూర్పు’ అందరికీ అనుకూలం
వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రంగా వరంగల్‌ తూర్పును చేయాలి. పరకాల, నర్సంపేట కాకుండా వరంగల్‌ తూర్పు అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. జిల్లా కేంద్రంగా తూర్పు ప్రాంతాన్ని ఎంపిక చేస్తే కార్యాలయాల ఏర్పాటు, ప్రజలు వచ్చివెళ్లేందుకు కానీ అనువుగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలి.
ఉప్పునూతుల శ్రీనివాస్, ఆత్మకూరు 
>
మరిన్ని వార్తలు