తెలంగాణ వలస కార్మికులకు పునరావాసం

4 Jan, 2015 22:22 IST|Sakshi

* సూరత్‌లోని తెలంగాణ వారికి కడియం శ్రీహరి హామీ
* వస్త్ర పరిశ్రమపై అధ్యయనానికి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు

సాక్షి, ముంబై: సూరత్‌లోని వలస కార్మికులకు తెలంగాణలో పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఇక్కడ పర్యటనకు వచ్చిన ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. గుజరాత్‌లో వస్త్ర పరిశ్రమకు పేరొందిన సూరత్‌లోని టెక్స్‌టైల్ పార్కులు, మార్కెట్‌లపై అధ్యయనానికి తెలంగాణ ప్రతినిధుల బృందం అక్కడికి వెళ్లింది.

తెలంగాణలోని వరంగల్ జిల్లా పరిసరాల్లో అధునాతనమైన టెక్స్‌టైల్ హబ్‌ను స్థాపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ బృందం ఇక్కడ పర్యటించింది. ప్రతినిధి బృందంలో వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూర రమేష్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు. సూరత్‌లోని తెలంగాణ ప్రజలు అడుగడుగున వీరికి ఘన స్వాగతం పలికారు.

ఈ బృందం ఇక్కడి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకోవడంతో పాటు నగరంలోని ఆధునిక హంగులతో కూడిన టెక్స్‌టైల్స్ పార్కులను, మార్కెట్‌లను పరిశీలించింది. సర్వేలో భాగంగా కొసంభా ప్రాంతంలోని అధునాతన టెక్నాలజీతో ఏర్పాటైన రెఫియర్ పవర్‌లూమ్స్ యూనిట్‌లను, మహాప్రభునగర్, ఉద్నా ప్రాంతాల్లోని చిన్న చిన్న పవర్లూమ్స్ యూనిట్‌లను పరిశీలించారు. టెక్స్‌టైల్ మార్కెట్‌లోని వ్యాపార సముదాయాలపై అధ్యయనం చేశారు.
 
తెలంగాణలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సూరత్‌లో స్థిరపడిన చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే టెక్స్‌టైల్ పార్కులో సూరత్‌లోని తెలుగు వారికి ప్రత్యేక సదుపాయలను కల్పించే విధంగా రాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు.

తిరిగి పవర్‌లూమ్స్ కార్మికులు తెలంగాణలో స్థిరపడడానికి, సూరత్‌లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు ఓపెన్ సిస్టమ్ ద్వారా పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. చదువుకున్న, అర్హులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సూరత్‌లో ఉంటున్న తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డులు, ఎలక్షన్ కార్డులు అందజేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బి.వి. పాపారావు మాట్లాడుతూ.. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ యూనిట్‌లు భారీ పరిశ్మ్రలై ఉండాలో లేక తక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేసే చిన్న చిన్న యూనిట్‌లు కావాలో మీరే నిర్ణయించుకోవాలని అన్నారు.
 
సూరత్‌లోని తెలంగాణ వలస కార్మికులకు టెక్స్‌టైల్స్ పరిశ్రమలో అపారమైన నైపుణ్యంతోపాటు అనుభవం ఉంది. చిన్న చిన్న పరిశ్రమలపై ఆధారపడిన వారికి తెలంగాణలో రాయితీలతో కూడిన సదుపాయాలను అందించి, సహకరించాలని ఇక్కడి చేనేత కార్మికులు కోరారు. శ్రీ మార్కండేయ పద్మశాలి జనరల్ సమాజం, సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్య సమితితో పాటు పలు సేవా సంస్థలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు తెలంగాణ ప్రతినిధి బృందానికి వినతిపత్రాలను అందజేశారు.

మరిన్ని వార్తలు