కేసీఆర్ నిర్ణయాలు కూడా మారాయి: కేటీఆర్

5 Oct, 2016 17:53 IST|Sakshi
కేసీఆర్ నిర్ణయాలు కూడా మారాయి: కేటీఆర్

హైదరాబాద్: పాలన ప్రజలకు మరింత చేరువయ్యేందుకే జిల్లాలు పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై విమర్శలు అర్థరహితమన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకుడుని, పాతఛత్రం నుంచి బయటపడనివారే ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం అనేకసార్లు నిర్ణయాలు మార్చుకుందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కూడా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు.

లక్ష అనుమానాల మధ్య పుట్టిన తెలంగాణ రాష్ట్రం రెండేళ్లలో ప్రగతివైపు వెళ్తోందని చెప్పారు. ఒకే ఒక్క రెవెన్యూ డివిజన్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. అనేక ఏళ్లు అధికారంలో ఉండి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేనివాళ్లు తమను విమర్శించడం శోచనీయమన్నారు. సీఎంగా కేసీఆర్ ప్రతిరోజు ప్రజలను కలవాల్సిన పనిలేదని, ప్రజాదర్బార్ నిర్వహించడానికి మనం రాచరికంలో లేమని పేర్కొన్నారు.

జీహెచ్ ఎంసీ పనితీరులో సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అధికారుల బదిలీలు, కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యాన్ని మారుస్తామన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదనీ, ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టే ఎంఐఎం మళ్లీమళ్లీ గెలుస్తోందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందన్నారు. ఈ నెల 12న వారం రోజుల పర్యటనకు అమెరికా వెళ్తున్నానని వెల్లడించారు. సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ లో ఫార్మాసిటీ కోసం అమెరికా కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నట్టు కేటీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు