నా అందానికి ఎక్కడో ఉండాల్సింది

6 Jun, 2015 02:00 IST|Sakshi
నా అందానికి ఎక్కడో ఉండాల్సింది

 తొలి అడుగుతోనే తెలుగు, తమిళం భాషల్లో జయం అంటూ మంచి విజయాలను అందుకున్న నటి సదా. దీంతో ఈమె భవిష్యత్ బంగారు బాటే అనుకున్నారు. అలాగే వరుసగా అవకాశాలను అందుకుంటూ కొన్ని చిత్రాలు చేసేసింది సదా. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో అజిత్, విక్రమ్, జయంరవి, మాధవన్ ప్రముఖ నటుల సరసన నటించేసింది. దీంతో సదా చిన్న నిర్మాతలకు అందని ద్రాక్షే అన్నంతగా ప్రచారం జరిగింది కూడా. అలాంటిది ఊహించని విధంగా ఆమెకు అవకాశాలు దూరం అయ్యాయి. కారణం ఏమైనా సదాను చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తమిళం సినిమా మరిచిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వడివేలుతో యువళగీతం పాడడానికి సై అనడంతో ఒక్కసారిగా కోలీవుడ్ సదాపై దృష్టి సారించింది. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. నటి శ్రీయ మంచి ఫామ్‌లో ఉండగా హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్ స్టెప్స్ వేసి తన మార్కెట్‌ను చేతులారా చెడగొట్టుకున్నారు. అది స్వయంకృతాపరాధమేనని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. అసలు అవకాశాలే లేని సదా ఇప్పుడు అదే వడివేలు సరసన ఎలి చిత్రంలో నటిస్తోంది. మరి ఈమె లక్ ఎలా ఉంటుందో? అయితే ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నానంటున్న సదాతో చిన్న భేటీ
 
 ప్ర: నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు. అయినా మీకంటూ ఒక స్థాయికి చేరుకోలేక పోయారు. దీనిపై మీ స్పందన?
 జ: నిజమే నటిగా రంగప్రవేశం చేసి పదేళ్లు అయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ  35 చిత్రాల్లో నటించాను. అయినా ఇప్పటికీ నేను ఆశించిన పాత్ర లభించలేదు. అందుకు కారణం కూడా తెలియలేదు. ఇంకా చెప్పాలంటే నా ప్రతిభకు, అందానికి నేనుండాల్సిన స్థాయే  వేరు. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. ఇకపై అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
 
 ప్ర: అజిత్, విక్రమ్ లాంటి పెద్ద హీరోలతో నటించిన మీరు వడివేలుతో నటించడం గురించి?
 జ: ఎలి మెగా బడ్జెట్ చిత్రం. మంచి హాస్య భరిత కథా చిత్రం. ఇందులో వడివేలుతో రొమాన్స్ సన్నివేశాలు ఉండవు. ఆయనకు నాకు మధ్య సాన్నిహిత్య సన్నివేశాలు చోటు చేసుకోవు కాబట్టే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను. మరో విషయం ఏమిటంటే వడివేలు సరసన తెనాలిరామన్ చిత్రం లోనే నటించమని అడిగారు. అప్పుడు నేను నటించలేని పరిస్థితి. దాంతో నిరాకరించాను.
 
 ప్ర: ఈ చిత్రంలో వడివేలుతో కలిసి హిందీ పాటలో నటించార ట?
 జ: అది వడివేలు డ్రీమ్ సాంగ్. హిందీ చిత్రం ఆరాధనలో రాజేష్‌ఖన్నా, షర్మిళా టాగూర్ నటించిన మేరే సప్పునోంకి రాణి పాటకు ఆడాం. ఈ చిత్రంలో నాది క్లబ్ డ్యాన్సర్ పాత్ర. పాత తరం హీరోయిన్ల గెటప్. డ్రస్, హేర్ స్టయిల్, డ్యాన్స్ అంతా నాటి తరహాలో ఉంటాయి.
 
 ప్ర: సింగిల్ సాంగ్‌కు కూడా నటించడానికి సిద్ధం అయినట్లున్నారు?
 జ: ఇంతకు ముందు చాలామంది చిన్న చిత్రాలకు ఒక పాట కు నటించమని అడిగారు. వారందరికి నో చెప్పాను. మదగజరా జ చిత్రంలో విశాల్ సరసన నటించమని కోరడంతో కాదనలేక పోయాను. సహజంగా నేను డ్యాన్సర్‌ని కావడంతో ఆ అవకాశాన్ని వదులుకోలేదు.
 
 ప్ర: తమిళంలో చాలా గ్యాప్ వచ్చినట్లుందే?
 జ: చంద్రముఖి చిత్రంలో నటించే అవకాశం మొదట నాకే వచ్చింది. నేను నటించలేని పరిస్థితి నెలకొనడంతో ఆ అవకాశం జ్యోతికను వరించింది. ఆ తరువాత మరో చిత్రంలో రజినీకాంత్ సరసన నయనతార నటించిన పాత్రలో నేను నటించాల్సింది. అదీ కుదరలేదు. అదే చిత్ర దర్శకుడు పి వాసు దర్శకత్వంలో కన్నడంలో చంద్రముఖి-2 లో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది.  నచ్చిన పాత్రలు లభించకపోవడంతో పెద్ద గ్యాప్‌కు కారణం.
 
 ప్ర: మైథిలి అనే తెలుగు చిత్రంలో గ్లామరస్ పాత్రలో విజృంభించారట?
 జ: ఆ చిత్రంలో పాటల సన్నివేశాల్లో కొంచెం గ్లామర్‌గా నటించిన మాట వాస్తవమే. ఆ సన్నివేశాల్నే కొందరు నెట్‌లో ప్రసారం చేయడంతో నేను అందాలారబోశానని ప్రచారం చేస్తున్నారు.
 
 ప్ర: బాయ్ ఫ్రెండ్ సంగతేమిటి ?
 జ: నేనొక చిత్రంలో నటిస్తే ఆ చిత్రం పూర్తి అయిన తరువాత అందుకు సంబంధించిన వారెవరితోనూ మాట్లాడను. అది నా పాల సి.  నాకు బాయ్‌ఫ్రెండ్  లేరు. భవిష్యత్తులో సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటానా? అన్నది చెప్పలేను. నేను ఎంచుకునేవాడు నన్ను నమ్మడం కంటే నాకు తనపై అధిక నమ్మకం కలగాలి.
 

మరిన్ని వార్తలు