తెలుగు విద్యార్థులతో చెలగాటం

15 Mar, 2019 12:36 IST|Sakshi
పళ్లిపట్టు బాలికల పరీక్ష కేంద్రంలో తెలుగు విద్యార్థుల నిరీక్షణ

చివరి వరకు ఉత్కంఠ పది పరీక్షలు ప్రారంభం

పడరాని పాట్లుపడిన తెలుగు విద్యార్థులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పదో తరగతి తెలుగు విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. నిర్బంధ తమిళం చట్టం నుంచి తాత్కాలిక మినహాయింపు జీఓ జారీ చేయడంలో జరిగిన జాప్యం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసింది. చివరి వరకు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యవహరించి విద్యార్థులను, తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేసింది. తమిళనాడులో నివసించే లింగ్విస్టిక్‌ మైనార్టీ కుటుంబాలకు 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం గుదిబండలా మారింది. 2015–16 విద్యాసంవత్సరంలో ఈ చట్టం కార్యరూపం దాల్చగా పదో తరగతి చదివే ఇతర భాషల వారు విధిగా తమిళం సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్బంధ తమిళం చట్టానికి అనుగుణంగా పాఠశాలల్లో తమిళ టీచర్ల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటిని పూర్తిగా విస్మరించి చట్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసింది. దీంతో వివిధ తెలుగు సంఘాల వారు ప్రభుత్వానికి విన్నవిస్తూ న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా 2015–16 విద్యాసంవత్సరంలో తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే ఆ ఏడాది నుంచి ప్రతి విద్యాసంవత్సరంలోనూ తెలుగు విద్యార్థు ఇదే సమస్యను ఎదుర్కోవడం, మినహాయింపు తెచ్చుకోవడం తప్పలేదు.

జీఓ విడుదలపై మరీ ఘోరం: అయితే ఈ ఏడాదికి సైతం మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరించింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్‌ జీఓ జారీపై తీవ్రస్థాయిలో జాప్యం చేశారు. మరో 48 గంటల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా ఈనెల 12న జీఓను విడుదల చేశారు. మాతృభాషలోనే పరీక్షలు రాసుకోవచ్చని మౌఖికంగా సమాచారం అందడంతో విద్యార్థులు ఆదిశగా పరీక్షకు సమాయత్తమయ్యారు. అయితే ఈ జీఓ రాష్ట్ర రాజధాని కేంద్రమైన చెన్నై మినహా అనేక జిల్లాలకు చేరలేదు. పది పరీక్షలు గురువారం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకుసమయం కేటాయించారు. తొలిరోజే లాంగ్వేజ్‌ 1 కింద తమిళం, తెలుగు, హిందీ తదితర (విద్యార్థులు ముందుగా ఎన్నుకున్న) సబ్జెక్టులో పరీక్ష రాయాల్సి ఉంది. తిరువళ్లూరు జిల్లాలో 520 మంది, కృష్ణగిరి జిల్లా 1,500 మంది, వేలూరు జిల్లాలో 120 మంది తెలుగు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యామంత్రి జారీచేసిన జీఓ తమకు అందలేదంటూ పరీక్షకేంద్రం నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హతాశులయ్యారు. మరో రెండుమూడు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉండగా ఇంతకూ తాము తెలుగు రాయాలా, తమిళం తప్పనిసరా తెలియక గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 11 గంటల తరువాత నిర్వాహకులు విద్యార్థుల వద్దకు వచ్చి మీరు ఏ భాష పరీక్షను రాయదలుచుకున్నారో తెలుపుతూ దరఖాస్తు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఒకింత ఉపశమనం పొందిన విద్యార్థులు దరఖాస్తులు భర్తీ చేసి ఉసూరుమంటూ పరీక్షకు హాజరయ్యారు.

పది పరీక్షలు ప్రారంభం: కాగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో 3731 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్ష రాసే సమయం కేటాయించారు. కాపీయింగ్‌ జరక్కుండా 5,500 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో పరీక్షల నిర్వహణ బృందాలు ఏర్పాటయ్యాయి. పరీక్షలు రాసే ఖైదీల కోసం పుళల్‌ జైల్లో ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా 27 మంది పురుష ఖైదీలు, ఇద్దరు మహిళా ఖైదీలు పరీక్షలు రాశారు. అలాగే వేలూరు జైల్లో ఆరుగురు, ఒక మహిళా ఖైదీ, కడలూరు జైల్లో 15 మంది లెక్కన మొత్తం 51 మంది ఖైదీలు పరీక్షలు రాశారు.

ఏప్రిల్‌ 12లోగా మూడో విడతకుగడువు: మూడో విడత కింద 6 నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 12వ తేదీలోగా ముగించాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 10, 11, 12 తరగతుల పరీక్షలు ఈనెల 29వ తేదీతో ముగుస్తున్నాయి. మూడో విడత పరీక్షలను ఏప్రిల్‌ 1న ప్రారంభించి 12వ తేదీలోగా ముగించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 18న పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు