తండ్రి మృతదేహంతో 14గంటల పాటు..

10 May, 2020 07:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: తండ్రి మృతదేహంతో పదేళ్ల బాలుడు 14 గంటల పాటు ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళనతో రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చున్నాడు. అమ్మ, నాన్నమ్మ కరోనా కారణంగా ఆస్పత్రిలో ఉండడం, అంత్యక్రియలు జరిపేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో వెరసి ఆ పసి హృదయం తల్లడిల్లింది. చివరకు గ్రామస్తులు స్పందించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. అయ్యనార్‌(35).. విల్లుపురం జిల్లా కండాచ్చిపురం సమీపంలోని నల్లపాళయంలో నివసిస్తున్నాడు. అయితే అయ్యనార్‌ భార్య, తల్లి కరోనా బారీన పడడంతో వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయ్యనార్‌ తన కొడుకుతో కలిసి ఉంటున్నాడు. కాగా ఇటీవల అయ్యనార్‌ ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రమాద బాధితులకు చికిత్స అందించలేని పరిస్థితి ఉండడంతో రెండు రోజుల క్రితం  అయ్యనార్‌ను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించేశారు. అయితే అయ్యనార్‌ శుక్రవారం సాయంత్రం మరణించాడు.

14 గంటలు మృత దేహంతో 
తన తండి మృతి చెందాడని తెలియక ఆ బాలుడు రాత్రంతా మృత దేహం పక్కనే నిద్రించాడు. అయితే ఉదయాన్నే లేచి తండ్రిని లేపడానికి ప్రయత్నించినా అయ్యనార్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఇంటి బయటకు వచ్చి దీనంగా కూర్చున్నాడు. అటు వైపుగా వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని పరామర్శించిగా విషయాన్ని వివరించాడు. ఇంటి లోపలికి వెళ్లిన సదరు వ్యక్తి అయ్యనార్‌ను పరిశీలించగా మృతదేహం కుళ్లిపోయిన వాసన వస్తుంది. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. అయితే ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేసినా వారు స్సందించలేదు. ఈ విషయం స్థానిక మీడియాకు తెలవడంతో శనివారం మధ్యాహ్నం స్పందించిన ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేలా గ్రామస్తులకు అనుమతిచ్చారు. 

అయితే తన భర్తను కడసారి చూసుకునేందుకు అవకాశం ఇవ్వాలని అయ్యనార్‌ భార్య వైద్యులను వేడుకోగా, వారు పరిస్థితిని అర్థం చేసుకొని అధికారులు  సేప్టీ డ్రెస్‌తో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి దూరం నుంచే భర్తను చూసి వచ్చేయాలని తెలిపారు.  అయ్యనార్‌ను దూరం నుంచి చూసిన అతని భార్య, అయ్యనార్‌ తల్లి బోరున విలపించారు. తండ్రి మృతదేహం వెంటే నడిచిన ఆ బాలుడు తల్లి, నానమ్మను చూడగానే మరింత ఏడ్వడం అక్కడున్నవారిని కలిచివేసింది. అయితే కరోనా నేపథ్యంలో బాలుడిని దగ్గరకు బాలుడి తల్లి, నానమ్మ ఓదార్చడానికి రాలేదు. గ్రామస్తులే బాలుడి దగ్గరికి వచ్చి దైర్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు