అబ్బో ఎంత వేడి!

7 Jan, 2015 03:10 IST|Sakshi
అబ్బో ఎంత వేడి!

 చెన్నై, సాక్షి ప్రతినిధి:  ‘భారత దేశానికి ఎన్నోసార్లు వచ్చాను, చెన్నైకి రావడం ఇదే మొదటి సారి, అబ్బో ఈ చెన్నైలో ఎంతవేడి’ అంటూ వ్యాఖ్యానించారు స్పానిష్‌కు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఫెలిసియానో లోపెజ్.  చెన్నై ఓపెన్ టెన్నిస్‌కు ఎయిర్‌సెల్  స్పాన్సర్స్‌గా నిలిచి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై కీల్‌కాక్‌లోని ఎయిర్‌సెల్ స్టోర్‌కు అతిథిగా విచ్చేసిన లోపెజ్ కొంతసేపు సందడి చేశారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. టెన్నిస్ బంతిపై సంతకాలు చేసి అందజేశారు. ఆహూతులతో తన అనుభవాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా లోపెజ్‌కు స్వాగతం పలికిన ఎయిర్‌సెల్ ఎస్‌బీయూ 1 (చెన్నై, రోటన్) హెడ్ కే శంకరనారాయణ్ అతనితో మాట్లాడుతూ, చెన్నై అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా, ఈ వేడి ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నానన్నారు.
 
 మాకు ఇది చలికాలం అని బదులివ్వడంతో లోపెజ్ విస్తుపోయారు. దక్షిణాది వంటలు రుచి చూశారా అని ప్రశ్నించగా పూరీ కూర భలే నచ్చిందన్నాడు. ప్రత్యేక డేటా బ్యాంక్‌తో కూడిన ఎయిర్‌సెల్ 3జీ సిమ్‌కార్డును లోపెజ్‌కు బహూకరించిన అనంతరం శంకరనారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారుల్లో 14వ స్థానంలో ఉన్న లోపెజ్ తాము స్పాన్సర్‌చేసే జట్టులో ఉండడం గర్వకారణమని అన్నారు. చెన్నై ఓపెన్ టెన్నిస్‌తో ఎయిర్‌సెల్ కలిసి నడిచి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయిందన్నారు. టెన్నిస్ క్రీడతో మమేకమై తమ ఖాతాదారులకు సెల్‌ఫోన్ సేవలతోపాటూ అదనపు ఆనందాన్ని కలుగజేస్తున్నామని చెప్పారు. తమిళనాడులో 25 మిలియన్లు, దేశంలో 75 మిలియన్ల వినియోగదారులున్నట్లు వివరించారు.  
 

>
మరిన్ని వార్తలు