తాత్కాలిక ‘మార్క్‌లిస్ట్’!

26 Feb, 2015 01:16 IST|Sakshi

 సాక్షి, చెన్నై:పదో తరగతి, ప్లస్‌టూ విద్యార్థులకు ఫలితాలు వెలువడగానే తాత్కాలిక మార్క్‌లిస్టుల మంజూరుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానం అమలుకు చర్యలు చేపట్టారు. అలాగే, విద్యార్థుల్ని విహార యాత్రకు తీసుకెళ్లాలంటే, వారి తల్లిదండ్రుల సంతకాలు, జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతిని తప్పనిసరి చేశారు. పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. మార్చి పదిహేను నుంచి ప్లస్‌టూ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ పరీక్షలు ముగియగానే, పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నా రు. మరో రెండు వారాలు మాత్రమే పరీక్షలకు సమయం ఉండడంతో ఏర్పాట్లను విద్యాశాఖ వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా బుధవారం గిండిలో పాఠశాల విద్యాశాఖ మంత్రి కేసీ.వీరమణి నేతృత్వంలో వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.  ఇందులో విద్యాశాఖ కార్యదర్శి సబిత, ఉన్నతాధికారులు కన్నప్పన్, దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ప్రశ్న పత్రాల భద్రత, స్పాట్ వాల్యుయేషన్, లీకులకు ఆస్కారం లేని రీతిలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పరీక్షల అనంతరం మార్క్‌లిస్టుల మంజూరులో నెలకుంటున్న జాప్యంపై చర్చించారు. విద్యార్థుల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక మార్క్‌లిస్టులను పంపిణీ చేయడానికి నిర్ణయించారు.
 
 తాత్కాలిక మార్క్ లిస్టులు
 ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సబిత మీడియాకు వివరించారు. పదోతరగతి, ప్లస్‌టూ పరీక్షల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల తరువాత మార్క్ లిస్టులను మంజూరు చేయడం జరుగుతోంద తెలిపారు. ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి తాత్కాలిక మార్క్ లిస్టులను విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంకతాలతో పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ మార్క్ లిస్టులకు 90 రోజుల వరకు కాల పరిమితి నిర్ణయించినట్టు తెలిపారు. ఆతర్వాత ఆ మార్క్ లిస్టులకు విలువ ఉండదని, అంతలోపు ఒరిజినల్ మార్కులిస్టులు చేతికందుతాయని చెప్పారు. ఈ తాత్కాలిక మార్కులిస్టుల ఆధారంగా ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందులో విద్యార్థి వివరాలు, ఫొటో, మార్కుల వివరాలు పొందు పరచనున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడాది నుంచే తమిళనాడులో ఈ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 
 విహారయాత్రకు అనుమతి తప్పనిసరి
 విద్యార్థుల విహార యాత్రలు పలు చోట్ల విషాదానికి దారి తీస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ విహారయాత్రకు వెళ్లాలంటే, కట్టుదిట్టమైన ఆంక్షల్ని పాఠశాలలకు విధించింది. ముందస్తుగా జిల్లా విద్యాశాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని ఆదేశించింది.  విహార యాత్రకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రుల సంతకాలతో కూడిన అనుమతి పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. జలాశయాలు, నదీ పరివాహక ప్రదేశాలకు విద్యార్థుల విహార యాత్రను నిషేధించారు.
 

మరిన్ని వార్తలు