ఉగ్రవాదమే అతిపెద్ద శత్రువు

16 Oct, 2016 07:46 IST|Sakshi
ఉగ్రవాదమే అతిపెద్ద శత్రువు

అఫ్ఘానిస్తాన్‌లో భారత రాయబారి డాక్టర్ షైదా మొహమ్మద్ అబ్దాలి
ఘనంగా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం


గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచానికి అతి పెద్ద శత్రువు ఉగ్రవాదమని అఫ్ఘానిస్తాన్‌లో భారత రాయబారి డాక్టర్ షైదా మొహమ్మద్ అబ్దాలి పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అబ్దాలి మాట్లాడుతూ నిరక్షరాస్యత, పేదరికం వంటిసామాజిక సమస్యలకు ఉగ్రవాదం కారణమన్నారు. వర్సిటీలు శక్తిమంతమైన మానవ వనరుల నిర్మాణ కేంద్రాలుగా మారాలని సూచించారు.

యువతరం విజ్ఞాన, నైపుణ్యాలను అభివృద్ధి పరచుకుని తమలోని శక్తియుక్తులను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. అఫ్ఘానిస్తాన్‌కు చెందిన 22 మంది విద్యార్థులు విజ్ఞాన్ వర్సిటీలో విద్యనభ్యసిస్తుండగా, దేశంలోని మరో 20 వర్సిటీల్లో 16 వేల మంది చదువుతున్నారని వివరించారు. స్నాతకోత్సవం సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల డెరైక్టర్ ఆచార్య ఫౌడ్ బెన్నీస్, పంచసహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అనంతరం 1,279 మంది విద్యార్థులకు డిగ్రీలు, 18 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.

కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.రామ్మూర్తినాయుడు, వీసీ డాక్టర్ సి.తంగరాజ్, రెక్టార్ డాక్టర్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ డీన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజిమెంట్ డాక్టర్ వి.మధుసూదనరావు, స్నాతకోత్సవ కన్వీనర్ పీఎంవీ రావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు