పొత్తు హిట్

18 Mar, 2016 03:47 IST|Sakshi
పొత్తు హిట్

సాక్షి, చెన్నై :  ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలు చేజిక్కించుకుని తీరాలన్న కాంక్షతో డీఎంకే పరుగులు తీస్తోంది. మెగా కూటమికి వేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, ఇక తమతో కలిసి వచ్చే వాళ్లను అక్కున చేర్చుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌తో పాటు చిన్న చిన్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక వర్గాల సంఘాలు డీఎంకే వైపుగా తమ దృష్టిని పెట్టి ఉన్నాయి. ఇప్పటికే పలు సంఘాలు, పార్టీల నాయకులు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌ను కలిసి తమ మద్దతను ప్రకటించారు. రోజురోజుకు ఈ మద్దతు సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో పన్నెండు చిన్న పార్టీలు, మరికొన్ని ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతు గణంతో అన్నా అరివాలయంకు చేరుకున్నారు. దళపతి స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
 
 తమ మద్దతును ప్రకటించారు. ఇక అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి నేత, సినీ నటుడు కార్తీక్ సైతం అన్నా అరివాలయంలో అడుగు పెట్టేందుకు సిద్ధమైనా చివరి క్షణంలో పర్యటన వాయిదా పడ్డట్టు అయింది. అయితే, ఆయన గోపాలపురం మెట్లు ఎక్కి డీఎంకే అధినేత కరుణానిధి ఆశీస్సులతో మద్దతు ప్రకటించే కసరత్తుల్లో ఉన్నట్టు నాడాలుం మక్కల్ కట్చి వర్గాలు పేర్కొంటున్నాయి. నడిగర్ తిలగం శివాజీ గణేషన్ అభిమాన సంఘం శివాజీ పేరవై వర్గాలు సైతం స్టాలిన్‌ను కలిసి మద్దతు ప్రకటించడం విశేషం. ఓ వైపు మద్దతు తెలిపేందుకు వస్తున్న వారిని ఆహ్వానిస్తూ, మరో వైపు సీట్ల పందేరానికి స్టాలిన్ సిద్ధమయ్యారు.
 
  తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో సమాలోచనలో మునిగారు. పార్టీ నాయకులు దురైమురుగన్, ఆర్‌ఎస్ భారతి,  ఐ పెరియ స్వామిలతో సమాలోచనల అనంతరం తమకు మద్దతు ఇస్తున్న కొన్ని సామాజిక వర్గాల వారీగా పార్టీలకు సీట్ల కేటాయింపు మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, రాష్ట్ర పార్టీ నాయకులతో కాంగ్రెస్ కమిటీ శుక్రవారం వెలువడే అవకాశాలు ఉన్న దృష్ట్యా, ఆ కమిటీ రాకతో సీట్ల పందేరాన్ని తేల్చేందుకు స్టాలిన్ కసరత్తుల్లో మునిగారు.
 

మరిన్ని వార్తలు