నాడూ.. నేడూ.. అదే డ్రామా!

19 Feb, 2017 08:37 IST|Sakshi
నాడూ.. నేడూ.. అదే డ్రామా!

తమిళనాట చరిత్ర పునరావృతం
- 30 ఏళ్ల కిందట ఎంజీఆర్ చనిపోయినపుడూ ఇదే సంక్షోభం
- ఆనాడు జానకి, జయలలితల మధ్య ఆధిపత్య పోరాటం
- ఇరు వర్గాలు మద్దతుదారులతో శిబిరాలు నిర్వహించిన వైనం
- జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ ఖురానా
- విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభలో ఇరు వర్గాల ఘర్షణ
- ఓటింగ్ చెల్లదంటూ జానకి సర్కారును రద్దు చేసిన గవర్నర్
- అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే గెలుపు


‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాట ఇప్పుడు అదే జరుగుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు.

ఆ విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. స్పీకర్ పోలీసులను పిలిపించి మరీ సభలో లాఠీచార్జి చేయించిన పరిస్థితి. చివరికి జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి విశ్వాసపరీక్ష నిర్వహించారు. నాడు కూడా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓటింగ్లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందినట్లు ప్రకటించారు. కానీ.. గవర్నర్ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకుని అన్నా డీఎంకే రెండు వర్గాలూ ఏకమవడం, కేంద్రం డీఎంకే సర్కారును రద్దు చేయటం, రాజీవ్గాంధీ హత్యానంతర ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నా డీఎంకే గెలుపొందటం చరిత్ర.

సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. నాడు ఎంజీఆర్ ఆశీస్సులతో పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా క్రియాశీలంగా ఉండగా.. నేడు జయ నమ్మినబంటుగా ఆమె పరోక్షంలో ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్సెల్వం అధికారం తనకే దక్కుతుందని ప్రకటించారు. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించి శిబిరం నడిపారు. పన్నీర్సెల్వం వైపు కేవలం పది మంది మాత్రమే నిలిచారు. అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా దోషిగా నిర్ధారితురాలై శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆమె తన స్థానంలో పళనిస్వామిని అధికార రేసులోకి పంపారు.


ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ విద్యాసాగర్రావు.. సభలో 15 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని నిర్దేశించారు. ఆ మేరకు శనివారం సభలో విశ్వాసపరీక్ష నిర్వహించగా.. మళ్లీ ఆనాటి గందరగోళమే చెలరేగింది. అయితే.. ఈసారి పన్నీర్ సెల్వం బలం తక్కువగా ఉండటంతో.. బలంగా ఉన్న ప్రతిపక్షం ‘క్రియాశీల’మవటమే తేడా. రహస్య బ్యాలెట్ ఓటింగ్కు పట్టుబడుతూ ఆందోళనకు దిగిన డీఎంకే సభ్యులను బయటకు పంపించిన స్పీకర్.. విశ్వాసపపరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు. ఇక తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ మరణించినపుడు తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి వీక్షిస్తే...

ఎంజీఆర్ మృతదేహం వద్ద..: డీఎంకే నుంచి చీలిపోయి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎదురులేని నేతగా.. తమిళుల ఆరాధ్యదైవంగా పూజలందుకున్న ఎం.జి.రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. అప్పటికే ఆయనతో కలిసి అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయలలిత.. ఆయన ఆశీస్సులతోనే పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా పనిచేస్తూ ప్రజాదరణ పొందారు. కానీ.. ఎంజీఆర్ భార్య జానకికి ఆమె అంటే పడదు. దీంతో ఎంజీఆర్ చనిపోయినపుడు ఆయన స్వగృహం ‘గార్డెన్స్’లో మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జయలలితను లోనికి కూడా రానివ్వలేదు. అయితే.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్కు తరలించినపుడు మాత్రం జయలలిత ఆయన తల వద్ద కదలకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ భౌతికకాయం ఉంచిన వాహనం పైకి జయలలిత ఎక్కినప్పుడు కూడా.. ఆమెను ఆ వాహనం నుంచి కిందికి తోసేసిన ఘటనను ప్రజలందరూ వీక్షించారు.

రాజకీయ చదరంగం షురూ..: ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. రాజకీయ చదరంగం మొదలైంది. జానకి వయసు 62 ఏళ్లు. జయలలిత వయసు 39 సంవత్సరాలు. ఇద్దరూ శాసనసభ్యలు కారు. అప్పటికే రాజ్యసభ ఎంపీ అయిన జయలలిత కొద్ది రోజుల్లోనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి జానకి సిద్ధమయ్యారు. జయలలిత ఆమెకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాల్లో చీలిపోయారు. జానకి శిబిరంలో 95 మంది ఎమ్మెల్యేలు చేరితే.. జయ శిబిరంలో 30 మంది జమయ్యారు. కానీ.. తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించుకుంది. జానకికి మద్దతుగా ఎంజీఆర్ అనుచరుడు ఆర్.ఎం.వీరప్పన్ నిలిస్తే.. జయలలితకు మద్దతుగా ఎస్.తిరునావుక్కరసర్ పనిచేశారు. వీరప్పన్.. జానకి వర్గం ఎమ్మెల్యేలను నగరంలోని త్రీస్టార్ హోటల్ ‘ప్రెసిడెంట్’కు తరలించారు. తిరునావుక్కరసర్.. జయ వర్గం ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్ ‘అడయార్ పార్క్’లో ఉంచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ‘భారత దర్శన్’ యాత్ర పేరుతో పర్యటనకు కూడా పంపించారు. ఇండోర్, ముంబై తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్కు వారిని తరలించారు.

రణరంగమైన శాసనసభ..: అప్పటి గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా.. ఇరు పక్షాలనూ ఆహ్వానించారు. తమ బలాలను చూపించమని కోరారు. జానకి మద్దతుదారులను వీరప్పన్ రాజ్ భవన్కు తీసుకెళ్లి గవర్నర్ ముందు నిలిపారు. కానీ.. జయ ఆ పని చేయలేదు. ఎందుకంటే అవసరమైనంత మంది సభ్యులు ఆమెవైపు లేరు. దీంతో 1998లో జానకిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఖురానా ఆహ్వానించారు. కానీ.. ఆ ప్రభుత్వం కేవలం రెండు వారాలే సాగింది. విశ్వాస పరీక్ష కోసం శాసనసభ సమావేశమైనపుడు.. జయ, జానకి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పటి శాసనసభ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్.. అనూహ్యంగా పోలీసులను పిలిపించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ కూడా చేయించడం సంచలనం సృష్టించింది. అసమ్మతి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష డీఎంకే ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో జానకి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ పాండ్యన్ ప్రకటించారు. అయితే.. ఆ ఓటింగ్ ప్రక్రియ పద్ధతిగా జరగలేదంటూ గవర్నర్ ఖురానా.. జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

ఎన్నికల్లో డీఎంకే గెలుపు.. బర్తరఫ్..: ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నా డీఎంకేలో వర్గ పోరు ప్రతిపక్ష  డీఎంకేకు లాభించింది. ఆ పార్టీ 13 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానకి రాజకీయాల నుంచి వైదొలగగా.. అన్నా డీఎంకే చీలిక వర్గాలు రెండూ జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ ఒత్తిడితో 1991 జనవరిలో తమిళనాడులో కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో అన్నా డీఎంకే భారీ విజయం సాధించింది. జయలలిత 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
                                                                                                                - (సాక్షి నాలెడ్జ్ సెంటర్)

మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి

జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి

చెన్నైకు చిన్నమ్మ?

విజేత పళని

అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్‌

చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్‌

స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు

 

మరిన్ని వార్తలు