కేంద్ర మాజీ మంత్రి యత్నాల్ అరెస్ట్

29 May, 2014 01:46 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి యత్నాల్ అరెస్ట్
  • మత ఘర్షణ కేసు ..
  •  26న బీజాపురలో విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో అల్లర్లు
  •  యత్నాల్, అతని అనుచరులే కారణమని గుర్తించిన పోలీసులు
  •  వారిపై పలు కేసులు
  •  మహారాష్ర్టలో తలదాచుకున్న నిందితుల అరెస్ట్
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : పధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో ఈ నెల 26న జరిగిన మత ఘర్షణకు కారణమంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐజీపీ భాస్కర్‌రావు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు .. మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో 26న బసవనగౌడ పాటిల్ యత్నాల్ నే తృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.

    గాంధీ చౌక్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అయితే మార్గ మధ్యలో ఒక మార్కెట్ దగ్గర ఒక వర్గం వారితో బీజేపీ నేతలు గొడవ పడ్డారు. అది కాస్త మత ఘర్షణకు దారితీసింది. ఆస్తి నష్టం చాలా జరిగింది. ఈ అల్లర్లకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్గులను పోలీసు అధికారులు పరిశీలించారు.

    ఓ వర్గం వారిని యత్నాల్, అతని అనుచరులు రెచ్చగొట్టడం వల్లే ఈ అల్లర్లు జరిగాయని గుర్తించారు. పలువురు ఫిర్యాదు చేయడంతో యత్నాల్, అతని ఐదుగురు అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని గుర్తించిన యత్నాల్ అనుచరుల సహా పరారై.. మహారాష్ట్ర కోల్లాపురలోని ఓరియంటల్ హోటల్ తప్పుడు సమాచారం ఇచ్చి తలదాచుకున్నారు.

    విషయాన్ని గుర్తించిన పోలీసులు యత్నాల్, అతని ఐదుగురు అనుచరులను బీజాపుర డీఎస్పీ బాలరాజ్ నే తృత్వంలో బుధవారం అరెస్ట్ చేశారు. వారందనీ బీజాపురలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని ఐజీపీ భాస్కర్‌రావు తెలిపారు. ఇప్పటికీ బీజాపురలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పారు.
     

>
మరిన్ని వార్తలు