సిమ్ కార్డు ఆధారంగా నిందితుడి అరెస్టు

25 Feb, 2015 23:06 IST|Sakshi

సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో రాయి విసిరిన ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు పోవడానికి కారుడైన నిందితున్ని సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల కిందట రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన దర్శనా పవార్ (29) అనే మహిళ సీఎస్టీలో లోకల్ రైలు ఎక్కింది. రద్దీ కారణంగా డోరు దగ్గర నిలబడింది. రైలు అంబర్‌నాథ్ స్టేషన్ దాటిన తరువాత ఓ ఆగంతకుడు విసిరిన రాయి ఆమె ముఖానికి తగలడంతో కిందపడింది.

తోటి ప్రయాణికులు కల్యాణ్ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేసి మరో రైలులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కాగా, కల్యాణ్ నుంచి వచ్చిన రైల్వే కానిస్టేబుల్ నిబంధన ప్రకారం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని పట్టుబట్టాడు. చివరకు ముంబైలోని కేం ఆస్పత్రికి తరలించారు. కాని ఆలస్యం కారణంగా ఆమె మరణించిన సంగతి తెలిసిందే. కాగా సంఘటన స్థలంవద్ద ఆమె ఒంటిపై నగలు, బ్యాగులో సెల్‌ఫోన్, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్శనా సిమ్ కార్డు ఆధారంగా ఫోన్ నాసిక్‌లోని వర్ణి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఫోన్ వినియోగిస్తున్న రతన్ మర్వాడి అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో ఇలాగే విరార్ పరిసరాల్లో రాయి విసిరి ఓ ప్రయాణికున్ని కిందపడగొట్టాడు. అతన్ని దోచుకున్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు