ఆర్కే నగర్‌పై అట్టుడికిన అసెంబ్లీ

20 Jun, 2017 04:47 IST|Sakshi
ఆర్కే నగర్‌పై అట్టుడికిన అసెంబ్లీ

ఉప ఎన్నికల  అక్రమార్కులపై కేసులేవీ?
ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షం
కేసులు పెట్టామన ముఖ్యమంత్రి ప్రకటన
ఇక చర్చ అనవసరమన్న స్పీకర్‌ ధనపాల్‌
సీఎం రాజీనామా కోరుతూ డీఎంకే వాకౌట్‌

‘‘ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో అధికార పక్షం అభ్యర్థి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.. నగదు ప్రవాహం చేయడం ద్వారా ఐటీ దాడులు, ఈసీ ఆక్షేపానికి గురై ఎన్నికల రద్దుకు కారణమైన వారిపై ఎందుకు కేసులు బనాయించలేదు’’ అన్న అంశంపై సోమవారం అసెంబ్లీ అట్టుడికిపోయింది. కేసులు పెట్టినట్లు సీఎం ప్రకటించినా సభ సద్దుమణగలేదు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్నీ వాకౌట్‌ చేశాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై:
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ మాట్లాడుతూ, ఆర్కే నగర్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు అందినా ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై కేసులు పెట్టలేదని ఆక్షేపించారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాలు వివిధ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు వాయిదావేసి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై చర్చకు పెట్టాలని కోరారు. అలాగే విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ముడుపులపై ఆధారాలు సభకు సమర్పించామని తెలిపారు. స్పీకర్‌ ధనపాల్‌ మాట్లాడుతూ, సదరు ఆధారాలను ఉదయం 9 గంటల తరువాతనే సమర్పించారని, అయినా డీఎంకే ఇచ్చిన సీడీని పరిగణనలోకి తీసుకోజాలమని అన్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో నగదు బట్వాడాపై సీఎంను బదులివ్వాలని కోరుతున్నట్లు స్పీకర్‌ అన్నారు. ఇంతలో డీఎంకే సభ్యులు అడ్డుతగులుతూ స్టాలిన్‌ మాట్లేందుకు మరింత అవకాశం ఇవ్వాలని, ఈ తరువాతనే సీఎం బదులివ్వాలని పట్టుపట్టారు.

స్పీకర్‌ అనుమతితో స్టాలిన్‌ మాట్లాడుతూ, ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో నగదు బట్వాడా సాగినట్లు తేలడంతో ఎన్నికలను రద్దుచేస్తూ ఏప్రిల్‌ 9వ తేదీన ఈసీ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ జరిపిన దాడుల్లో వైద్య మంత్రి విజయభాస్కర్‌ తదితర 21 చోట్ల ఆర్కే నగర్‌ అక్రమాలపై ఆధారాలు, రూ.89 కోట్లు పంపిణీ జరిగినట్లు రుజువులు లభించాయని ఆయన అన్నారు. మధ్యలో స్పీకర్‌ ధనపాల్‌ అడ్డు తగులుతూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను గురించి మాత్రమే మాట్లాడాలని అన్నారు. మళ్లీ స్టాలిన్‌ కొనసాగిస్తూ ‘‘ఆర్కేనగర్‌లో నగదు బట్వాడాకు కారణమైన వారిపై కేసులు పెట్టాలని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశాలు పంపింది.

అయితే నగదు పంపిణీ వ్యవహారంలో సాక్షాత్తు సీఎం, సహా పలువురు మంత్రులు ఉన్నారు. కేసులు పెట్టారా, ఒకవేళ పెట్టినా సీఎం, మంత్రులను పోలీసులు ధైర్యంగా విచారించే అవకాశం ఉందా’’ అని ప్రశ్నించారు. పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేసిన సీఎం, మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామాచేసి పారదర్శక విచారణకు సహకరించాలని డిమాండ్‌ చేశారు. అయితే స్టాలిన్‌ ప్రసంగాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్న స్పీకర్‌ ప్రకటించడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రసంగానికి అనుమతిచ్చిన స్పీకరే తన మాటలను రికార్డులను తొలగించారని ఎద్దేవా చేయడంతో డీఎంకే సభ్యులు లేచి నిలబడి నిరసన ప్రకటించారు.

స్పీకర్‌ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్లో నిందితులుగా ఎవరి పేరూ ప్రస్తావించలేదని, అయితే కొందరి పేర్లున్నట్లు స్టాలిన్‌ పేర్కొనడంతో రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చిందని అన్నారు. స్టాలిన్‌ విమర్శలకు సీఎం ఎడపాడి బదులిస్తూ, న్యాయవాది వైరకన్నన్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల వివరాలను అడిగారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడుల తరువాత కొందరిపై కేసులు పెట్టారు, అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయని తాము బదులిచ్చామని చెప్పారు. సీఎం సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు మరోసారి స్టాలిన్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టాయి.

అయితే స్పీకర్‌ ఇందుకు నిరాకరిస్తూ కేసులు పెట్టినట్లుగా సీఎం స్పష్టం చేసినందున ఇక చర్చ అనవసరమని అనడం, ఎవరెవరిపై కేసులు పెట్టారో సీఎం స్పష్టం చేయకపోవడంతో డీఎంకే వాకౌట్‌ చేసింది. అసెంబ్లీ మాట్లేడే అవకాశం ఇవ్వలేదని టీటీవీ దినకరన్‌ వర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్‌ సైతం వాకౌట్‌చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సవాల్‌ చేయగా, స్థానిక సంస్థలపై అసెంబ్లీలో చర్చించరాదని స్పీకర్‌ తోసిపుచ్చారు.

ప్రాథమిక విద్య సంచాలకుల కార్యాలయ  ప్రాంగణంలో రూ.33 కోట్లతో ఎంజీఆర్‌ శతజయంతి స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. చిన్నతరహా వ్యాపారస్తులకు ఇచ్చే రుణాలను రూ.10 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఉన్నత, సమోన్నత పాఠశాలల్లో రూ.437 కోట్లతో ఉన్నతస్థాయి వృత్తి విద్యా పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు