తాత్కాలిక విరమణ

11 Jun, 2017 01:26 IST|Sakshi
తాత్కాలిక విరమణ

జల్లికట్టు తరహాతో భయపెట్టిన అన్నదాతలు
మెరీనాలో మోహరించిన పోలీసులు
రెండు నెలల్లో డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం హామీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నదాతలను ఆదుకోకుంటే జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని భయపెట్టారు. నగరం దిగ్బంధం అయిపోయింది. మెరీనా బీచ్‌ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దిగివచ్చిన ప్రభుత్వం రెండునెలల గడువు కోరడంతో రైతన్నలు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం దక్షిణభారత నదుల అనుసంధానం సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేశారు.

ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపి డిమాం డ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఢిల్లీలో ఆందోళన విరమించారు. అయితే సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఆందోళనబాట పట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంజలి ఘటించడానికి, రైతులు కోర్కెల సాధన కోసం చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద శుక్రవారం నిరవధిక ఆందోళన ప్రారంభించారు. కాల్పుల్లో మృతి చెందిన రైతుకు తొలిరోజున అంజలి ఘటించేలా ఆం దోళన జరిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి చెన్నైలోని పలు ప్రాంతాల నుంచి వం దల సంఖ్యలో యువకులు రైతుల ఆందోళనా శిబిరానికి చేరుకున్నారు.

ఇంకా మరికొందరు ద్విచక్రవాహనాల్లో బయలుదేరగా నగరంలోని పలుచోట్ల పోలీసులు నిలిపివేసి వెనక్కు పంపారు. అ తరువాత రైతుల అందోళనా శిబిరం ఉన్న చేపాక్‌ ప్రభుత్వ అతిథిగృహం వైపు వెళ్లే అన్ని మార్గాలకు బారికేడ్లను అడ్డుపెట్టి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఆందోళనా శిబిరం వైపు వాహనాలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. వంద మందికి పైగా పోలీసులు ఆ పరిసరాల్లో బందోబస్తుగా నిలిచారు. వాలాజా రోడ్డులో వాహనాలను అనుమతించకుండా దారిమళ్లించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్యోగాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్నాశాలై, కామరాజర్‌శాలై  ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు నెలకొన్నాయి.

రైతుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో యువకులు తరలిరావడంతో మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందని కంగారుపడిన పోలీసు యంత్రాంగం మెరీనా బీచ్‌ వద్ద గట్టి బందోబస్తు పెట్టింది. రెండోరోజు ఆందోళన సందర్భంగా అర్ధనగ్నంగా శిబిరంలో కూర్చున్నారు. చేపాక్‌ స్టేడియం సమీపంలో కార్పొరేషన్‌ పార్కులోని టాయిలెట్ల వినియోగానికి అనుమతించారు. పోలీసులే రైతులకు ఆహార సదుపాయాన్ని కల్పించారు. కాగా, చెన్నై సచివాలయంలో సీఎంతో చర్చలకు రైతు ప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. అయ్యాకన్ను నేతృత్వంలో ఐదు గురు రైతులు సీఎంతో చర్చలు జరిపారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, చెరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్లను సీఎం ముందుంచారు.

ముఖ్యమంత్రితో చర్చించిన ఆంశాలను రైతులకు వివరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సచివాలయంలో మీడియాకు అయ్యాకన్ను చెప్పాడు. సీఎంను కలిసిన అనంతరం అయ్యాకన్ను నేరుగా ఆందోళనా శిబిరానికి వచ్చి సీఎంతో చర్చించిన ఆంశాలను వివరించాడు. పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేద్దామని కోరగా అందరూ చేతులు ఊపుతూ తమ ఆమోదాన్ని తెలిపారు. ఆ తరువాత ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయ్యాకన్ను మీడియా వద్ద ప్రకటించాడు. రెండు నెలల్లోగా తమ డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్లాస్టిక్‌ బియ్యం అంశాన్ని ప్రస్తావించగా, తమిళనాడులోకి వాటిని రానివ్వమని ఆర్థికమంత్రి జయకుమార్‌ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

అర్ధనగ్నంగానే సీఎం వద్దకు:
 సీఎంతో చర్చలకు వచ్చేవారు చొక్కాలు ధరించి రావాలని పోలీసులు కోరారు. దీంతో ఆందోళనా శిబిరాల్లోని వారికి చొక్కాలు తెచ్చివ్వాలని బందోబస్తులో ఉన్న పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే అయ్యాకన్ను సహా మిగిలిన రైతు ప్రతినిధులు చొక్కా వేసుకునేది లేదని భీష్మించుకోవడంతో అర్ధనగ్నంగానే సీఎం వద్దకు అనుమతించక తప్పలేదు

>
మరిన్ని వార్తలు