జీవో రద్దు చేసే వరకు ఆందోళన: వీహెచ్

26 Nov, 2014 03:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసే వరకు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమలేదని, రాజకీయ లబ్ధికోసమే ఆయన పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు.

‘ఎన్టీఆర్ పేరు పెడుతూ 1999లోనే నిర్ణయం జరిగిందని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు చెబుతున్నారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉన్న బాబు అప్పుడు పేరు ఎందుకు పెట్టలేదు’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెటిలర్లలో తన ఆధిపత్యం చూపించుకోవడానికే బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడేందుకు రాజ్యసభ చైర్మన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. అంతకుముందు  పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు.

మరిన్ని వార్తలు