క్రికెట్‌ తెచ్చిన తంటా..!

25 Jul, 2017 09:14 IST|Sakshi
క్రికెట్‌ తెచ్చిన తంటా..!
► రెండు గ్రామాల మధ్య ఘర్షణ
► ఒకరి మృతి
► గ్రామస్తుల రాస్తారోకో, పోలీస్‌ బందోబస్తు

తిరువణ్ణామలై (తమిళనాడు): క్రికెట్‌ తెచ్చిన తంటా కాలనీ వాసులు, అగ్ర కులస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అగ్ర కులానికి చెందిన వారు రాత్రికి రాత్రి కాలనీపై దాడిచేశారు. దాడిలో ఒకరు మృతిచెందారు. బాధిత కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు తాలుకా పులియేర పాక్కం కాలనీకి చెందిన యువకులు, కాంచీపురం రోడ్డులోని పెరుంబులిమేడుకు చెందిన యువకులు ఆదివారం సాయంత్రం శ్మశానం వద్ద క్రికెట్‌ ఆడుతున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి పెరుంబులి మేడుకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని సహ యువకులు గ్రామస్తులకు తెలపడంతో గ్రామంలోని సుమారు 30 మంది మారణాయుధాలతో రాత్రి 9 గంటల సమయంలో పులియేరబాక్కం గ్రామానికి వెళ్లి వీధిలో ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేశారు. ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిని తీవ్రంగా కత్తులతో గాయపరిచారు. దాడిలో జయరాజ్, దయాళన్, గణపతి, వెంకటేషన్‌(32) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయనపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో వెంకటేషన్‌ పరిస్థితి విషమించడంతో కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేషన్‌ సోమవారం ఉదయం మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా రెండు గ్రామాల్లో పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. దాడుల్లో గాయపడిన మహిళలతో పాటు కాలనీవాసులు ఒకేసారి సెయ్యారు–కాంచీపురం రోడ్డులో సోమవారం రాస్తారోకో చేశారు. కాలనీ వాసులపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, వెంకటేషన్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ కిరుబానందం, డీఎస్పీ గుణశేఖరన్‌ గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.
మరిన్ని వార్తలు