నిర్ణయం బోర్డుదే

11 Nov, 2014 01:07 IST|Sakshi
నిర్ణయం బోర్డుదే

బోర్డు నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయి
ఆర్‌బీసీ ఆధునికీకరణపై ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన  
కర్ణాటకలో ఆన్‌లైన్ ట్రేడింగ్ విధానం భేష్ : చంద్రబాబు
ల్యాండ్‌పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి భూమి సేకరణ
ఈ చర్చ వల్ల ఒరిగింది శూన్యమన్న కర్ణాటక నీటిరంగ నిపుణులు

 
బెంగళూరు : తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (ఆర్‌బీసీ) ఆధునికీకరణకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తుంగభద్ర నదీ జలాల పంపకం కోసం ఏర్పాటైన బోర్డుదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. బోర్డు నిర్ణయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయని వారు తెలిపారు. తుంగభద్ర నదీ జలాల పంపకం విషయమై ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య సోమవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిగాయి. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఆర్‌బీసీ ఆధునికీకరణ పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక నీరావరి నిగమ్ వద్ద ఆర్‌బీసీ ఆధునికీకరణకు   సంబంధించిన విషయం పరిశీలనలో ఉందన్నారు. ఇక్కడ నుంచి టెక్నికల్ సబ్ కమిటీకి అటుపై తుంగభద్ర బోర్డు ముందుకు ఆధునికీకరణ విషయం పరిశీలనకు వస్తుందన్నారు. ఆధునికీకరణకు సంబంధించి బోర్డు నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలు విధిగా అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఆధునికీకరణకు అవసరమైన నిధుల విషయంలో కూడా బోర్డు నిర్ణయం అనంతరం స్పష్టత వస్తుందన్నారు.

  కాగా, చర్చల అనంతరం వ్యవసాయ రంగంలో కర్ణాటక అవలంభిస్తున్న నూతన విధానాలపై సంబంధిత అధికారులు కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ సమక్షంలో సీఎం చంద్రబాబునాయుడుకు దాదాపు గంటపాటు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంబిస్తున్న ఆన్‌లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి దీనితో పాటు మరికొన్ని విధానాలను ఏపీలో అమలు చేయనున్నానని తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
 డిజైన్‌లో మార్పులేదు - సిద్ధు
 తుంగభద్ర ఆర్‌బీసీ ఆధునికీకరణ జరిగినా కాలువ డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం 190 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువలో పూడిక పేరుకుపోవడం వల్ల ఏడాదికి 32 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు కోల్పోతున్నాయన్నారు. ఈ పూడిక ఇలాగే కొనసాగితే 32 టీఎంసీలకు అదనంగా ప్రతి ఏటా 0.45 టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఆధునికీకరణ విషయం తుంగభద్ర బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాజా చర్చల్లో కేవలం ఆర్‌బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం మాత్రమే చర్చకు వచ్చిందని...  వరద నీటి కాల్వ విషయం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. చర్చల్లో రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదలశాఖ మంత్రులు ఎంబీపాటిల్, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన  పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రయోజనం శూన్యం!

తుంగభద్ర ఆర్‌బీసీ ఆధునికీకరణ విషయమై సోమవారం జరిగిన చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని కర్ణాటక నీటిరంగ నిపుణులతోపాటు చర్చల్లో పాల్గొన్న మంత్రులు పేర్కొంటున్నారు. తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు బోర్డుముందుకు తీసుకువెళ్లినా వాటిని కొట్టివేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బోర్డు ముందుకు నేరుగా వెళితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదని భావించడం వల్లనే ఏపీ ప్రభుత్వం నేరుగా కర్ణాటక దగ్గరకు వస్తోందని, అయితే ఈ చర్చల వల్ల కూడా ప్రయోజనం శూన్యమేనని చర్చల్లో పాల్గొన్న ఓ మంత్రి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు