శేఖర్‌ రెడ్డికి ప్రాణభయం!

12 Jul, 2017 03:42 IST|Sakshi
శేఖర్‌ రెడ్డికి ప్రాణభయం!

కిడ్నాప్‌చేసి హత్య చేయాలని కుట్ర
చెన్నై పుళల్‌జైల్లో  ఖైదీల వ్యూహం
రాజకీయ నేతల హస్తం
బందోబస్తు కోసం వినతి

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో చక్రం తిప్పిన ప్రముఖ ఇసుక కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. తనకు, తన కుటుంబానికి కొందరినుంచి ప్రాణహాని ఉన్నందున తగిన బందోబస్తు కల్పించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఆయన వినతిపత్రం సమర్పించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై:  శేఖర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి హత్యచేసేందుకు వ్యూహరచన చేసినట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రజా పన్నుల శాఖలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తిగా శేఖర్‌రెడ్డి ఎదిగారు. ఇసుక కాంట్రాక్టరుగా కోట్లాది రూపాయలు గడించారు.గత ఏడాది డిసెంబరులో చెన్నై, వేలూరు జిల్లాల్లోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులుచేయడం.. సుమారు రూ.120 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారు, వెండి నగలు వస్తువులను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.

ఐటీ దాడుల్లో పట్టుబడిన నగదులో రూ.33 కోట్లు ఆర్‌బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లు కావడం కలకలం రేపింది.పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప మొత్తాలు సైతం బ్యాంకుల్లో అందుబాటులో లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో శేఖర్‌రెడ్డి వద్ద ఏకంగా కోట్లాది రూపాయలు దొరకడం ఐటీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన నేరం కింద ఐటీ శాఖతోపాటు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ కూడా వేరుగా కేసును నమోదుచేసి విచారణ చేస్తోంది. శేఖర్‌రెడ్డితోపాటు ఆయన వ్యాపార భాగస్వాములను కూడా అరెస్ట్‌చేసి పుళల్‌ జైల్లో పెట్టారు. శేఖర్‌రెడ్డి అరెస్టయి నెలలు దాటుతున్నా ఐటీ, ఈడీ అధికారులు చార్జిషీటు పెట్టకపోవడంతో మద్రాసు హైకోర్టు ఇటీవలే బెయిల్‌ మంజూరు చేసింది.

హతమార్చేందుకు కుట్ర : శేఖర్‌రెడ్డి
షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన శేఖర్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా, శేఖర్‌రెడ్డిని కిడ్నాప్‌చేసి హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నట్లు వెల్లడైంది. దేశంలోని ప్రముఖులను కిడ్నాప్‌చేసి హతమార్చే ఖరీదైన క్రిమినల్‌ గ్యాంగ్‌కు శేఖర్‌రెడ్డి వ్యవహారాన్ని అప్పగించినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌లోని కొందరు చెన్నై పుళల్‌జైల్లో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆ గ్యాంగ్‌ కదలికలపై నిఘాపెట్టిన జైలు అధికారులు శేఖర్‌రెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ విషయాన్ని ఢిల్లీలో ఉన్న శేఖర్‌రెడ్డికి చేరవేసి అప్రమత్తంగా ఉండమని సూచించారు.

అధికారుల సూచన తరువాత తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తగిన భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు శేఖర్‌రెడ్డి వినతి పత్రం పంపారు. అయితే ఆయనకు ఎటువంటి భద్రత కల్పించలేదు. క్రిమినల్‌ గ్యాంగ్‌ ఆటలు కట్టించేందుకు చర్యలు కూడా చేపట్టలేదు. ఇదిలా ఉండగా, పుళల్‌జైల్లో ఉన్న క్రిమినల్‌ గ్యాంగ్‌ తమవారిని ములాఖత్‌ కింద జైలుకు పిలిపించుకుని కిడ్నాప్, హత్యపై వ్యూహరచన సాగించినట్లు తెలుసుకున్న అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరోసారి ఆయనకు సూచించారు. దీంతో శేఖర్‌రెడ్డి మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు భద్రత కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆ విజ్ఞప్తిని స్వీకరించిన ఢిల్లీ పోలీసులు సోమవారం తొలిదశ విచారణను ప్రారంభించారు. అలాగే తమిళనాడు హోంశాఖ కార్యదర్శి సైతం శేఖర్‌రెడ్డి విజ్ఞప్తిని డీజీపీకి పంపారు. భద్రతకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని ఆయన పోలీసుశాఖకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో శేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటవుతుందని భావిస్తున్నారు.

హత్య వెనుక అసలు ఉద్దేశం
పుళల్‌ జైల్లోని కొందరు ఖైదీల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని శేఖర్‌రెడ్డి చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు తలెత్తాయి. ఆయనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎందరో రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమిళనాడు ఇసుక అమ్మకాలు, ప్రభుత్వ పనుల టెండర్లు పొందడంలో ఆయన కొందరు రాజకీయనేతలకు వాటాలు ఇస్తుంటారని సమాచారం. శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసినపుడు రాజకీయనేతలతో సంబంధాలపై ఆధారాలు దొరికినట్లు అధికారులే చెబుతున్నారు. ఇంటిపై దాడుల తరువాతనే రాష్ట్రంలో అనేక సంచలన దాడులు చోటుచేసుకున్నాయి. శేఖర్‌రెడ్డి నోరుతెరిస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో పుళల్‌జైలులోని ఖైదీల సహాయంతో కిడ్నాప్, హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక ఆయనను బెదిరించి భారీ ఎత్తున సొమ్మును రాబట్టేందుకు కూడా ఈ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చని అంటున్నారు. శేఖర్‌రెడ్డి కిడ్నాప్, హత్యకు కుట్ర వ్యవహారంపై తమిళనాడు పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు