కేపీసీసీ తొలి సమావేశంలోనే అసమ్మతి స్వరం

20 Oct, 2013 02:56 IST|Sakshi

 

= ‘లోక్‌సభ’ అభ్యర్థుల ఎంపిక తీరుపై సీనియర్ల అసంతృప్తి  
 = పరోక్షంగా ఢిల్లీ నాయకులపై విమర్శలు
 = అభ్యర్థుల గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి
 = కార్యకర్తల అభిప్రాయాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి
 = ఢిల్లీకి వెళ్లి పార్టీ టికెట్లు తెచ్చుకునే పద్ధతికి చరమ గీతం పాడాలి
 = నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వరాదని డిమాండ్
 = సమావేశానికి దిగ్విజయ్ సింగ్ డుమ్మా

 
 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగా శనివారం నగరంలో ఓ హోటల్‌లో జరిగిన కేపీసీసీ కార్య వర్గ సమావేశంలో స్వల్పంగా అసమ్మతి స్వరాలు వినిపించాయి. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో పార్టీకి పెద్దగా సీట్లు రావని, మోడీ ప్రభావం చాప కింద నీరులా పాకుతోందనే సర్వేలు, కథనాల నేపథ్యంలో ఎవరూ అసమ్మతి స్వరం వినిపించకూడదని అధిష్టానం ముందుగానే కట్టుదిట్టమైన హెచ్చరికలు జారీ చేయడంతో ‘రాముడు మంచి బాలుడు’లా నాయకులందరూ మసలుకున్నారు.

అయితే కోలారు జిల్లా శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్ కుమార్ లాంటి సీనియర్లు సుతిమెత్తగా తమ అసమ్మతి గళాన్ని వినిపించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇదివరకే పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక గురించి సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ నాయకుల తీరును పరోక్షంగా ఎండగట్టారు. అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు వారి అర్హతలు, గుణగణాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యకర్తల అభిప్రాయాలకు పెద్ద పీట వేయాలని సూచించారు.  ‘శక్తి సామర్థ్యాలు’ కలిగిన అనేక మంది నాయకులు ఢిల్లీకి వెళ్లి పార్టీ టికెట్లు తెచ్చుకోగలుగుతున్నారని దెప్పి పొడిచారు. ఈ సంప్రదాయానికి చరమ గీతం పాడాలని కోరారు. అనర్హులకు, సామర్థ్యం లేని వారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. కాగా క్రిమినల్ నేపథ్యం ఉన్న వారికి టికెట్లు ఇవ్వరాదని పలువురు సీనియర్లు సూచించారు.

 అసంతృప్తికి అవకాశం ఇవ్వవద్దు

 కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షుల నియామకం, అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, కార్యకర్తల అభిప్రాయాలను విధిగా పరిగణనలోకి తీసుకోవాలని, తద్వారా అసంతృప్తికి చోటు లేకుండా చూసుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు. అధికారులు హద్దులో ఉండేలా చూసుకోవాలని, ఎమ్మెల్యేలు, కార్యకర్తల విజ్ఞప్తులను వారు పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవడానికి అవసరమైన భూమికను సిద్ధం చేసుకోవాలని కోరారు. అధిష్టానం ఏర్పాటు చేసిన సమన్వయ సమితి సలహాలు, సూచనలను విధిగా పాటించాలని సూచించారు.

 దిగ్విజయ్ సింగ్ డుమ్మా


 పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఈ సమావేశానికి రాలేదు. ఏఐసీసీ కార్యదర్శులు సెల్వ కుమార్, శాంతరామ్ నాయక్‌లు హాజరయ్యారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు పాల్గొన్నారు.

 మోడీని ఎదుర్కొనే వ్యూహం


 గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రంలో ఎదుర్కోవడానికి వ్యూహాన్ని సిద్ధం చేశామని పరమేశ్వర తెలిపారు. కార్య వర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూపీఏ-1, 2 ప్రభుత్వ సాధనలపై బూత్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మోడీని బీజేపీ అతిగా చూపిస్తోందంటూ, అంతకు మించి వారి వద్ద ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మోడీ రాకతో పార్టీ విజయావకాశాలు దెబ్బ తింటాయా అని అడిగినప్పుడు, ఆయన ప్రభావం ఏమీ ఉండదని అన్నారు.

ఆయనను చూడడానికి రూ.10 సమర్పించుకోవాలట...అని వ్యంగ్యోక్తులు విసిరారు. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఏడింటినే గెలుచుకుంటుందని వెలువడిన ఓ సర్వే గురించి ప్రశ్నించినప్పుడు, ఇలాంటి సర్వేల గురించి తాము ఆందోళన చెందడం లేదన్నారు. మొత్తం 28 సీట్లపై దృష్టిని కేంద్రీకరించామంటూ అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా తదుపరి ఏఐసీసీ ప్లీనరీని బెంగళూరులో నిర్వహించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతూ సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు