మర్మమేమిటో?

19 Sep, 2014 02:08 IST|Sakshi
మర్మమేమిటో?
  • గవర్నర్‌తో యడ్డి భేటీ
  •  ‘అర్కావతి డీ నోటిఫికేషన్’పై చర్చ?
  •  ముఖ్యమంత్రి సిద్ధును కోర్టుకీడ్చాలని వ్యూహం !
  •  సీఎం ప్రాసిక్యూట్‌కు అనుమతి కోసమేఈసమావేశమా
  •  యడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే  ముప్పుతిప్పులు పెట్టిన కాంగ్రెస్
  •  నేడు అదే ఆయుధాన్ని ప్రయోగించనున్న బీజేపీ
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన డీనోటిఫికేషన్‌లు, ముఖ్యంగా అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోర్టుకీడ్చాలని ప్రతిపక్ష బీజేపీ తహతహలాడుతోంది.

    ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కేసుల్లో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎవరైనా సరే, అడిగిందే తడవుగా అప్పటి గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ తలూపేవారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ఇప్పుడు అదే ఆయుధంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పులు పెట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది.

    ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గవర్నర్‌తో సుమారు 40 నిమిషాల పాటు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. వీరి మధ్య చర్చలో అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గత వారం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌లు గవర్నర్‌ను రహస్యంగా కలుసుకున్నారు.

    ఈ విషయం బట్ట బయలు కావడంతో ‘కొత్త గవర్నర్ కనుక మర్యాద పూర్వకంగా కలుసుకున్నాం’ అని వివరణ ఇచ్చారు. అర్కావతి డీనోటిఫికేషన్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని శెట్టర్ శాసన సభ లోపల, బయట అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు తన వంతుగా యడ్యూరప్ప ఆ పనిలో పడ్డారు. డీనోటిఫికేషన్‌పై న్యాయ పోరాటానికి దిగితే, సీఎంను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా యడ్యూరప్పతో పాటు గతంలో శెట్టర్ కూడా గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది.
     
    మర్యాద పూర్వకమే...

    గవర్నర్‌ను తాను కలుసుకోవడంలో విశేషమేమీ లేదని యడ్యూరప్ప తెలిపారు. దీనిపై తనతో మాట్లాడిన విలేకరులకు వివరణ ఇస్తూ, ‘గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కలుసుకోలేదు. ఈ రోజు అపాయింట్‌మెంట్ ఖరారైంది. కొన్ని విషయాలపై ఆయనతో మాట్లాడాను. సహజంగానే  రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి’ అని తెలిపారు. అనంతరం యడ్యూరప్ప ఢిల్లీకి వెళ్లారు.
     

మరిన్ని వార్తలు