విగ్రహాలకు హాని జరిగితే బీఎంసీదే బాధ్యత!

11 Sep, 2013 00:45 IST|Sakshi

 సాక్షి, ముంబై:  గణేశ్ ఉత్సవాల సమయంలో విగ్రహాలకు ఏదైనా హాని జరిగితే దాని బాధ్యత బీఎంసీ పరిపాలన విభాగానిదేనని బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ హెచ్చరించారు.
 
 గణేశ్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో గణేశ్ ఉత్సవ మండళ్ల పదాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవాల సమయంలో నాలుగు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతినిచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో నగర రహదారులపై పడిన గుంతలను పూడ్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేశారు. మరో పక్క బీఎంసీ కూడా ఉత్సవాలకు ముందే వాటిని పూడ్చివేయిస్తామని మండళ్లకు హామీ ఇచ్చింది.

కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.  గత ఏడాది నిమజ్జనాల సమయంలో ఊరేగింపులోని ఓ సార్వజనిక గణేశ్ మండలి భారీ విగ్రహం ట్రాలీ చ క్రం గుంతలో ఇరుక్కుని  పక్కకు ఒరిగిపోయింది. దీంతో విగ్ర హానికి హాని జరిగింది. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇదిలా ఉండగా ఉత్సవాల సమయంలో వినాయకుని దర్శనం కోసం క్యూలో నిలబడిన మహిళలు, బాలికలపై ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండళ్లదే అని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ ప్రకటించడంపై కూడా మండళ్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు