కసరత్తులు

7 Jan, 2014 04:49 IST|Sakshi
కసరత్తులు
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత తలమునకలయ్యూరు. కొడనాడు వేదికగా కసరత్తులు ఆరంభం అయ్యాయి. ఎక్కువ శాతం సీట్లు  కొత్త వాళ్లకు, విద్యావంతులకు కేటాయించే విధంగా ప్రక్రియ సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి , సీఎం జయలలిత ముందుకెళుతున్నారు. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 సీట్ల బరిలో అభ్యరుల్ని నిలబెట్టి, అన్నింటా విజయ బావుటా ఎగురవేయూలని వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. నాలుగు వేల వరకు దరఖాస్తులు రాగా, అందులో వెయ్యి వరకు జయలలిత ఎంపీగా పోటీ చేయాలంటూ దాఖలయ్యాయి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆశావహుల చిట్టా సిద్ధం అయింది. 
 
 జాబితా పరిశీలన: చెన్నైలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సిద్ధమైన అభ్యర్థుల జాబితా కొడనాడుకు చేరింది. విశ్రాంతి నిమిత్తం జయలలిత కొడనాడు ఎస్టేట్‌లో ఉండటంతో అక్కడి నుంచి కసరత్తుల్ని ఆరంభించారు. అభ్యర్థుల జాబితాను జయలలిత పరిశీలిస్తున్నారు. దరఖాస్తుల్లో ఆశావహులు పేర్కొన్న అంశాల్ని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి ముగ్గుర్ని ఎంపిక చేస్తున్నారు. ఆయా ఆశావహుల జన, ధన బలాన్ని ప్రధానంగా పరిశీలించడం గమనార్హం. జయలలిత సూచించిన పేర్ల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో రహస్య పరిశీలనల్లో ప్రత్యేక బృందం ఉన్నట్టు సమాచారం. మరి కొద్ది రోజుల్లో సీఎం జయలలిత చెన్నైకు రాగానే, ఎంపిక చేసిన ఆశావహులతో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితా ఫిబ్రవరిలో వెలువరించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
 కొత్త ముఖాలు: 
 
 లోక్‌సభ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడానికి సీఎం జయలలిత నిర్ణయించారు. ప్రధానంగా యువజన విభాగంలో ఉన్న వారికి, పార్టీలోని విద్యావంతులకు అవకాశం కల్పించే విధంగా కసరత్తులు జరుగుతున్న సమాచారం కొత్త వాళ్లల్లో ఆనందాన్ని నింపుతోంది. లోక్‌సభలో అనర్గళంగా తమిళం, ఆంగ్లం మాట్లాడ గలిగే సత్తా ఉన్న వాళ్లతోపాటుగా ప్రధాన అంశాలపై జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనే ధైర్య వంతుల్ని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్టు పార్టీ వర్గాలుపేర్కొన్నాయి. రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న సీనియర్ నాయకుల సేవల్ని పార్టీకి ఉపయోగించుకునే విధంగా, వారి వారసులకు పెద్ద పీట వేయడం లక్ష్యంగా జయలలిత నిర్ణయం తీసుకున్న సమాచారంతో తమ వాళ్లకంటే తమ వాళ్లకు సీట్లు దక్కవచ్చన్న ఆనందాన్ని పలువురు సీనియర్లు వ్యక్తం చేయడం గమనార్హం. బరిలో మంత్రులు: లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముగ్గురు మంత్రుల్ని దించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.
 
 లోక్‌సభ ఎన్నికల అనంతరం వీరి సేవల్ని ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకునేందుకు జయలలిత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కళ్లకురిచ్చి, కృష్ణగిరి, కరూర్ జిల్లాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు ఆ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఈమంత్రులు ఇక వారి జిల్లా పరిధిలోని లోక్ సభ నియోజకవర్గాల్లో తిష్ట వేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో సీనియర్ మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, మునుస్వామి, వైద్యలింగంతో పాటుగా ఏడుగురు మంత్రుల్ని కొడనాడుకు పిలిపించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జయలలిత చర్చ జరిపినట్టు ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. మంత్రులు బరిలో దిగేందుకు అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
మరిన్ని వార్తలు