వాగ్యుద్ధం

22 Jul, 2017 03:00 IST|Sakshi
వాగ్యుద్ధం

స్పీకర్‌తో స్టాలిన్‌ ఢీ
సమాధానం కరువుతో వాకౌట్‌
అన్ని నగరాల్లో రూ.1,362 కోట్లతో స్మార్ట్‌ సిటీలు
దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్‌లో నమోదు
అసెంబ్లీలో మంత్రి ఎస్‌పీ వేలుమణి ప్రకటన


ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై స్పీకర్‌ ధనపాల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ మధ్య బుధవారం అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తన ప్రశ్నలతో స్పీకర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినా, సమాధానాలు మాత్రం రాబట్టలేదు. దీంతో స్పీకర్‌ తీరును నిరసిస్తూ సభనుంచి డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. ఇక, నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అభివృద్ధిపరంగా నిధుల కేటాయింపు చర్చలో ఆ శాఖ మంత్రి  ఎస్పీ వేలుమణి పలు కొత్త ప్రకటనలు చేశారు.

సాక్షి, చెన్నై :
అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభ వేడెక్కింది.  ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు సంధించిన అనేక ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. చెన్నైలో మరో 100 మినీ బస్సు సేవలు సాగనున్నట్టు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్, అడవి పందుల కాల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చినట్టు అటవీశాఖ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ తన ప్రసంగంలో బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని గళం విప్పారు. ఇందుకు స్పీకర్‌ ధనపాల్‌ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేశారు. దీంతో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జారీచేసిన ఉత్తర్వుల గురించి ప్రసంగాన్ని అందుకున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో, గవర్నర్‌కు ఎలాంటి వివరణ ఇచ్చారో స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు.

ఇందుకు స్పీకర్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురూ మాటల తూటాల్ని పేల్చుకున్నారు. గవర్నర్‌ తమను ప్రశ్నించారని, అందుకుతగ్గ వివరణ ఇచ్చుకున్నామని, అది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ స్పీకర్‌ తేల్చి చెప్పారు. గవర్నర్‌కు పంపే లేఖలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. దీంతో స్పీకర్‌ తీరును నిరసిస్తూ డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు.

ఈ సందర్భంగా స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్‌ అంతా రహస్య వ్యవహారాలు సాగిస్తుండడం శోచనీయమని విమర్శించారు. ముడుపుల వ్యవహారం కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక, సభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం సాగుతున్నా, ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా ఆ ఎమ్మెల్యేలు మౌనంగానే ముందుకు సాగుతున్నారు.

స్మార్ట్‌ సిటీలు
డీఎంకే వాకౌట్‌ తదుపరి సభలో నగర, గ్రామీణాభివృద్ధి శాఖకు నిధుల కేటాయింపులపై మంత్రి ఎస్‌పీ వేలుమణి కొత్త ప్రకటనలు చేశారు. ఇందులో 66 అంశాలున్నాయి. ప్రధానంగా రూ.250 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరివాహక ప్రదేశాల్లో రెండు లక్షల చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, రూ.300 కోట్లతో చెరువులు, కొలనుల్లో పూడికత తీత, రూ.200 కోట్లతో గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాట్లు ఉన్నాయి.

అలాగే, చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని భవనాల మీద సౌర విద్యుత్‌ ఉత్పత్తికి రూ.39 కోట్లు కేటాయించారు. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి తదితర పన్నెండు కార్పొరేషన్లలో రూ.1,326 కోట్లతో స్మార్ట్‌ సిటీల నిర్మాణం చేపట్టి, 2020 నాటికి ముగించేందుకు నిర్ణయించారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తి విలువ తదితర అనుమతులు, వివరాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌పరం చేశారు. ఈషా కేంద్రంతో ఔట్‌రీచ్‌ విషయంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు