వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి హత్య

19 Oct, 2013 04:24 IST|Sakshi
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో గురువారం రాత్రి వేర్వే రు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ముగ్గురు హత్యకు గురైనట్టు పోలీసులు తెలిపారు. నెల్లై జిల్లా పాళయంకోటైకు చెందిన జయకుమార్ భార్య ఎప్సీబాయ్(59) అక్కడున్న సారల్ తాక్కర్ కళాశాలలో 1976 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి 2012న విశ్రాంతి పొందారు. వారి కుమారుడు స్టీఫెన్ (24) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. చెంగల్పట్టులోని ఓ కంపెనీలో స్టీఫెన్‌కు ఉద్యోగం వచ్చింది. వేలంబాకం తైయూర్‌లో ఉన్న అపార్టుమెంట్‌లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేసి తల్లితో సహా తొమ్మిది నెలలుగా ఆరవ అంతస్తులో నివాసముంటున్నాడు. 
 
 గురువారం ఎప్సీబాయ్ ఒంటరిగా ఉండడం చూసి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె తలను గోడకు కొట్టి, గొంతు బిగించి హత్య చేశారు. తర్వాత ఆమె ధరించిన చైన్, బంగారు గాజులు సహా ఆరు సవర్ల నగలు, బీరువాలో దాచివుంచిన రూ.5 వేలు ఎత్తుకెళ్లారు. పని నుంచి రాత్రి పది గంటలకు స్టీఫెన్ ఇంటికి వచ్చాడు. తల్లి మృతిచెంది ఉండడం చూసి బోరున విలపించాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న కాంచీపురం ఎస్పీ విజయకుమార్, తిరుపోరూర్ ఇన్‌స్పెక్టర్ తిరునావుక్కరసు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.
 
 యువకుడి హత్య :
 పుదుచ్చేరి తిరుభునై, చిన్నమేడు ప్రాంతానికి చెందిన దక్షిణామూర్తి కుమారుడు ఓంప్రకాష్ (23) స్థానికంగా ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఇళంతమిళన్ (20), ఇదే ప్రాంతానికి చెందిన అరుణ్ అనే అరుణ్‌కుమార్ (23)తో కలిసి బంగూరులో ఉన్న ప్రైవేటు సెల్ టవర్‌కు మరమ్మతుల కాంట్రాక్ట్ పని చేశారు. వచ్చిన డబ్బును పంచుకోవడంలో ఇద్దరికీ ఘర్షణ తలెత్తింది. గురువారం రాత్రి పనిముగించుకుని ఇళంతమిళన్, అన్న ఓం ప్రకాష్ మీనాక్షి నగర్ మార్గంలో ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో అరుణ్‌కుమార్, అతని మిత్రుడు సత్యానందం ఓంప్రకాష్‌తో గొడవపడ్డారు. ఆపై ఓంప్రకాష్‌ను హత్య చేసి పారిపోయారు. ఈ సంఘటనపై త్రిభువనవనం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. 
 
 మాజీ సర్పంచ్ భర్త హత్య
 అరియలూరు జిల్లా తిరుమానూర్, తూత్తూర్ గ్రామానికి చెందిన కామరాజ్ (45) భార్య వలర్మతి. ఈమె తూత్తుర్ పంచాయతీ మాజీ సర్పంచ్. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో కామరాజర్, అతని అన్న కరుప్పయ్యఆ ప్రాంతంలో ఉన్న పొలానికి నీరు పెట్టడానికి బైక్‌లో వెళ్లారు. ఆ సమయంలో కంచెలో దాగి ఉన్న గుర్తుతెలియని ముఠా బైకును అడ్డుకుని కత్తితో కామరాజర్, కరుప్పయ్యపై దాడి చేశారు. రక్తపు మడుగులో కిందకు ఒరిగిన కామరాజర్, కరుప్పయ్యను స్థానికులు తంజావూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యలోనే కామరాజర్ మృతి చెందాడు. కరుప్పయ్యకు వైద్యులు అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తూత్తూర్ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు