‘ప్రేమైక’ జీవుల కోసం...

10 Feb, 2015 00:06 IST|Sakshi
‘ప్రేమైక’ జీవుల కోసం...

ప్రేమికుల కోసం సరికొత్త థీమ్ పార్టీలు
హోటల్స్, పబ్‌లలో ప్రేమ జంటలకు ప్రత్యేక బహుమతులు
కళాశాలల్లోను ప్రత్యేక వాలంటైన్ పోటీలు

 
ప్రేమ గుర్తుగా ‘పచ్చ’ బొట్టు...

ప్రస్తుతం వాలంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ మంది ప్రేమికులు తమ ప్రేమ ‘గుర్తు’ను పచ్చబొట్టుగా పొడిపించుకుంటున్నారట. గత రెండు రోజులుగా టాటూ స్టూడియోలకు వెళుతున్న ప్రేమ పక్షుల సంఖ్య పెరగడమే ఇందుకు ఉదాహరణ. ఈ ట్రెండ్ పై నగరంలోని ఓ ప్రముఖ టాటూస్ స్టూడియో ప్రతినిధి కమల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ...ప్రస్తుతం చాలా మంది ప్రేమికులు వాలంటైన్స్ డే రోజున తమ ప్రేమ గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకునేందుకు ఇష్టపడుతున్నారు. చాలా మంది హృదయాకారం అందులో తమ ‘వాలంటైన్’ పేరును టాటూగా వేయించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ వాలంటైన్ ముద్దు పేర్లను చేతి వేళ్లపై టాటూగా వేయించుకుంటున్నారు’ అని చెప్పారు. పర్మినెంట్ టాటూస్ వేయించుకునేటపుడు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. అయితే తమ ప్రేమను శాశ్వతంగా శరీరంపై ముద్ర వేసుకుంటున్నామనే సంతోషం ముందు ఈ నొప్పి చాలా చిన్నదని ప్రేమికుడు అవినాష్ చెబుతున్నారు.
 
బెంగళూరు: శిలలాంటి మనిషికి జీవాన్ని పోసేది ప్రేమ, తడి ఆరిపోయిన మనసులో పచ్చని ఆశలను చిగురింపజేసేది ప్రేమ, ఆ తూరుపును, ఈ పశ్చిమాన్ని ఒక దగ్గరకు చేరుస్తూ, దేశాల సరిహద్దులను దాటేస్తూ ఎన్నో పడమటి సంధ్యారాగాలను పలికించేది ప్రేమే. అందుకే ప్రేమ నిత్యసత్యం, నిత్యనూతనం. పేద, ధనిక బేధాలెరుగని ప్రేమ ‘మేం ప్రేమి‘కులం’, మాది ప్రేమ‘కులం’ అని ప్రేమ జంటలు పాడుకునే ధైర్యాన్నిస్తుంది. అంతటి మహోన్నతమైన ప్రేమ వ్యక్తీకరణ ఒక్క రోజుకు ఏ మాత్రం పరిమితం కాదు. కానీ మన జీవితంలో భాగమైన ఎన్నో విషయాలను మరొక్క సారి మననం చేసుకోవడానికి, వాటి గొప్పదనాన్ని ‘మన’సైన వారితో కలిసి పంచుకోవడానికి ఒక రోజంటూ అవసరమౌతుంది. ఈ విషయం ప్రేమకు కూడా వర్తిస్తుంది. ‘ప్రేమ’దేవత కటాక్షం కోసం ఎదురుచూసేవారు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి, ప్రేమ సాగరాన్ని ఈదుతున్న ప్రేమ పక్షులు తమ జీవితంలో మరిన్ని మధురానుభూతులను మూటగట్టుకోవడానికి, ప్రేమలో విజయం సాధించి దంపతులుగా మారిన జంటలు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆత్రంగా ఎదురుచూసే రోజే వాలంటైన్స్ డే. అందుకే ఈ వాలంటైన్స్ డేని ఎవరికి వారు ప్రత్యేకంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ తరహా ప్రేమైక జీవుల కోసం నగరంలో ఎన్నో ‘థీమ్’ పార్టీలు, మరెన్నో పోటీలు ఏర్పాటవుతున్నాయి. వాటన్నింటి  సమాహారమే ఈ కథనం...
 
సరికొత్త థీమ్ పార్టీలు...
 
వాలంటైన్స్ డే సందర్భంగా నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లు, పబ్‌లలో సరికొత్త థీమ్ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ థీమ్ పార్టీల్లో ప్రేమ జంటల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నాయి. ఒకరి అభిరుచులు, ఇష్టా ఇష్టాలపై వారి భాగస్వామికి ఉన్న అవగాహనను పరీక్షించడానికి నిర్వహించే చిన్నపాటి క్విజ్‌లు, తమ తమ జీవితాల్లో మరుపురాని రోజులుగా నిలిచిన తేదీల గురించి ప్రశ్నలు వేయడం లాంటి పోటీలు ఈ థీమ్‌పార్టీలో భాగంగా ఉన్నాయి. ఈ తరహా పోటీల్లో గెలిచిన వారికి నగదు బహుమతులతో పాటు మనసుకు నచ్చిన ప్రాంతాలను చుట్టివచ్చే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇక మరికొన్ని హోటల్స్ వాలంటైన్స్ డే రోజున తమ హోటల్‌కి వచ్చే ప్రేమ జంటలకి బిల్‌లో డిస్కౌంట్‌లను కూడా ప్రకటించేస్తున్నాయి.
 
గులాబీ బాలకు  భలే గిరాకీ......
 
వాలంటైన్ డే అనగానే  రకరకాల రంగుల్లో విరబూసిన అందమైన గులాబీలే మనకు గుర్తుకువస్తాయి. రాష్ట్రంలో పండే గులాబీలకు నగరంలోనే కాక విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. వాలంటైన్ డే రోజున ఇక్కడి పూలను ఒక్కోటి రూ.50 నుంచి రూ.100 వరకు కూడా వెచ్చించి కొనడానికి ప్రేమికులు ముందుకొస్తారు. ఈ ఏడాది నగరంలోనే 12 లక్షలకు పైగా గులాబీలు అమ్ముడవుతాయని రాష్ట్ర ఫ్లోరికల్చర్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విదేశాలకు ఎగుమతయ్యే గులాబీల సంఖ్య 50 లక్షల మార్కును దాటనుందని భావిస్తున్నారు.
 
కళాశాలల్లోను ‘వాలంటైన్’ సందడి...
నగరంలోని వివిధ కళాశాలల్లోను వాలంటైన్స్ డే సరదాల సందడి కనిపిస్తోంది. ‘ప్రేమ’ అంటే? ఈ ప్రశ్నకు తమదైన రీతిలో సమాధానం చెప్పాల్సిందిగా కళాశాల యాజమాన్యాలు విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఈ తరహా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రేమకు నిర్వచనాన్ని తమదైన రీతిలో చెబుతున్నారు. కొంతమంది విద్యార్ధులు ఇందుకోసం చిత్రకళను ఎంచుకుంటే, మరికొంత మంది విద్యార్ధులు కుడ్యచిత్రాల ద్వారా తమ సమాధానాలను చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు