నియోజకవర్గ ముఖచిత్రం

23 Jan, 2015 23:27 IST|Sakshi
పార్టీలు మారిన పాత అభ్యర్థులు

నియోజకవర్గ ముఖచిత్రం
మతియామహల్‌లో ముక్కోణమే..
 

న్యూఢిల్లీ: ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే మతియామహల్‌లో ఈసారి త్రిముఖ పోటీ తథ్యమనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ పాతవారే అయినా వారు పోటీచేస్తున్న పార్టీలు మాత్రం మారిపోవడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గతసారి ఆయన జనతాదళ్ యునెటైడ్ తరఫున పోటీ చేసి గెలిచారు. పార్టీలు మార్చడం షోయబ్ ఇక్బాల్‌కు కొత్తకాదు. గతంలో ఆయన రెండుసార్లు జనతా దళ్ నుంచి, ఒకసారి జేడీ(ఎస్), ఒకసారి ఎల్జేపీ నుంచి, ఒకసారి జేడీయూ నుంచి గెలిచారు. పార్టీలతో నిమిత్తం లేకుండా షోయబ్ ఇక్బాల్‌ను ఎన్నుకుంటున్న మతియామహల్ ఓటర్లు మరోసారి ఆయనను గెలిపిస్తారో లేదో ఫిబ్రవరి 10న తేలనుంది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన షకీల్ అంజుమ్ దెహల్వీ ఈసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ఏకైక ముస్లిం అభ్యర్థి దెహల్వీయే కావడం గమనార్హం.

తాను బీజేపీ తరఫున పోటీచేయడంలో విచిత్రమేమీ లేదని దెహల్వీ అంటున్నారు. తన తండ్రి అన్వర్ దెహల్వీ కూడా జన్‌సంఘ్‌లో ఉండేవారని, ఆయన రెండుసార్లు మెట్రో పాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచారని ఆయన చెబుతున్నారు. ఆప్ ఈసారి ఆసీమ్‌ఖాన్‌కు టికెట్ ఇచ్చింది. కాగా, దెహల్వీ రంగంలోకి దిగడం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మతియా మహల్‌లో ముక్కోణపు పోటీ తథ్యమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మతియా మహల్‌లో ఇంతవరకు బీజేపీ ఎన్నడూ గట్టి పోటీ ఇవ్వలేదు. నిజానికి దాన్ని ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా పరిగణించలేదు.గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఆరు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మూడవ స్థానంలో నిలిచిన దెహల్వీ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండటం వల్ల ఫలితాలలపై దాని ప్రభావం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నియోజవర్గం ఓటర్లలో 67 శాతం ముస్లింలు కాగా, 31 శాతం హిందువులు,  2 శాతం మంది సిక్కులు ఉన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు