రగులుతున్న అసంతృప్తి జ్వాలలు

28 Mar, 2014 03:30 IST|Sakshi
రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
  • ‘మండ్య’లో తారస్థాయికి
  • చల్లార్చడంపై కేపీసీసీ దృష్టి
  • ఎస్‌ఎం, అంబి వర్గాల మధ్య విభేదాలు
  • రమ్యకు సహకరించని ఆత్మానంద
  • ఎస్‌ఎంతో సిద్ధు, పరమేశ్వర భేటీ
  • ‘కృష్ణ’ రాయబారం చేయాలంటూ ఒత్తిడి
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో అసంతృప్తిని చల్లార్చడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మండ్య జిల్లా నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ అభ్యర్థి రమ్య పుట్టి ముంచేట్లు ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు ముందుగా ఆ స్థానంపై దృష్టి సారించారు.

    ప్రస్తుతం సింగపూర్‌లో చికిత్స పొందుతున్న మండ్య జిల్లాకు చెందిన మంత్రి అంబరీశ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్మానంద వర్గాల మధ్య విభేదాలున్నాయి. ప్రచారం సందర్భంగా రమ్యకు ఆత్మానంద వర్గం నుంచి సహకారం అందడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయనకు కేంద్ర మాజీమంత్రి ఎస్‌ఎం. కృష్ణ అండదండలున్నాయి. ఎన్నికల సమయంలో ఆత్మానందను చూస్తూ ఊరుకుంటే పార్టీలో క్రమశిక్షణ లోపించడంతో ఎన్నికల్లో నష్టం వాటిల్లడం ఖాయమనే అభిప్రాయం అంబరీశ్ తదితరుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.

    దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆత్మానందను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనికి ఎస్‌ఎం. కృష్ణ ఆమోద ముద్ర కోసం సీఎంతో పాటు పరమేశ్వర గురువారం ఇక్కడి సదాశివనగరలోని ఆయన నివాసానికి వెళ్లారు. మండ్య విషయమై చర్చించారు. అయితే ఆత్మానందను తొలగించడానికి ఆయన సమ్మతించ లేదని తెలిసింది. నచ్చజెప్పి పార్టీకి పని చేసే విధంగా చూడాలే తప్ప, తొలగిస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. ‘ఆ బాధ్యతేదో మీరే చేపట్టండి’ అని చెప్పి వారిద్దరూ వెళ్లిపోయినట్లు సమాచారం.

    ఇదే సందర్భంలో ఒక్కలిగ సామాజిక వర్గం ప్రాబల్యం కలిగిన నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని కూడా కృష్ణను కోరినట్లు తెలిసింది. మండ్య ఉప ఎన్నికలో అందరూ కలసి కట్టుగా పని చేసినందునే కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవగలిగిందని, ఇప్పుడు కూడా ఆ ఐక్యతను తీసుకు రావాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
     

మరిన్ని వార్తలు