మధ్యాహ్నం వరకు ‘సర్కారు’పై స్పష్టత!

18 Oct, 2014 22:30 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మునుపెన్నడులేని విధంగా జరిగిన చారిత్రాత్మక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుపడనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది మరి కొన్ని గంటల్లో స్పష్టం కానుంది. అన్ని పార్టీలూ ఒంటరిగా బరిలోకి దిగడంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈసారి మునుపెన్నడులేని విధంగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ, ఎమ్మెన్నెస్ తదితర ప్రముఖ పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఎన్నికల ప్రచారాలు కూడా వాడీవేడిగా సాగాయి.

దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఎన్నికల సమయంలో మహారాష్ట్రకు అధిక సమయాన్ని కేటాయించారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన ఆశీర్వాదాలు, మరాఠీలు వర్సెస్ గుజరాతీయులు తదితర అంశాలు అధికంగా తెరపైకి వచ్చాయి.
 
ఉదయం ఎనిమిది నుంచి ఓట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపును ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 4119మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముందు పోస్టల్ ఓట్ల లెక్కింపు జరపనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలే వినియోగించడంతో ఫలితాలు కూడా చాలా త్వరగా వెల్లడికానున్నాయి. దీంతో విజేతలు ఎవరన్నది  మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటలలోపు తేల డంతో పాటు రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కనుందన్నది స్పష్టం కానుంది. దీంతో ఈసారి దీపావళి పండుగకు కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని తెలుస్తోంది.

తేలనున్న ప్రముఖుల భవితవ్యం...
అసెంబ్లీ ఎన్నికలలో అనేక మంది దిగ్గజ నాయకులు పోటీ చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. దక్షిణ కరాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల తీర్పుపై అందరిలో ఉత్కంఠత కన్పిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఆయనకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి విలాస్‌కాకా ఉండాల్కర్ గట్టి పోటీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ప్రముఖులైన నారాయణ రాణేకు కుడాల్ నియోజకవర్గంలో వైభవ్ నాయిక్ నుంచి గట్టి పోటీ ఏర్పడింది. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, సచిన్ ఆహీర్, జితేంద్ర అవాడ్, బబన్‌రావ్ పాచ్‌పుతే, ప్రతిపక్ష నాయకులైన ఏక్‌నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డే, తదితర అనేక మంది ప్రముఖుల భవితవ్యం ఆదివారం స్పష్టం కానుంది.

ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొన్ని వివరాలు.
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 288
పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు 4119
మొత్తం ఓట్ల లెక్కింపు కేంద్రాలు 288
ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.

మరిన్ని వార్తలు