పట్టువదలని పోలీస్‌

7 Jul, 2017 01:52 IST|Sakshi
పట్టువదలని పోలీస్‌

వందలాది పోలీసులను బందోబస్తు పెట్టినా అనుకుందని నేరవేర్చుకున్నారు. కోర్కెల, సమస్య సాధనకు తలపెట్టిన సచివాలయ ముట్టడి పోరాటాన్ని పోలీసు కుటుంబాలు గురువారం అమలుచేశాయి. సచివాలయంలోకి చొరబడే ప్రయత్నం చేసిన 50 మంది మాజీ పోలీసులను, కుటుంబ సభ్యులను ఉన్నతాధికారులు అరెస్ట్‌ చేశారు.
సచివాలయాన్ని ముట్టిడించిన మాజీ అధికారులు, కుటుంబసభ్యులు
బిత్తరపోయిన ప్రత్యేక బలగాలు
50 మంది అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: సచివాలయం పరిసరాల్లో ప్రత్యేక బలగాలు మొహరించినప్పటికీ పోలీసుల కుటుంబాలు ముట్టడించాయి. తమిళనాడులో పోలీసుల సంక్షేమ సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే పోలీసుల సమస్యల పరిష్కారానికి సంఘం ఏర్పాటు ద్వారా ఒక వేదిక కావాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 1.18 లక్షల మంది పోలీసుల వేతనాల పెంపు, ఎనిమిది గంటల పని, సంక్షేమ సంఘం, క్వార్టర్ల సదుపాయం తదితర కోర్కెలపై ప్రభుత్వ స్పందన కరువవడంతో పోరాడి సాధించుకోవా లని నిర్ణయించుకున్నారు. గత నెల 22వ తేదీన పలుచోట్ల ‘దయనీయంగా తమిళనాడు పోలీస్‌శా ఖ’ అనే పేరుతో ప్రత్యక్షమైన పోస్టర్లు పోలీసు ఉన్నతాధికారులను బెంబేలెత్తించాయి. డీజీపీ రాజేంద్రన్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలోని పోలీసులపై జిల్లా ఎస్పీలు నిఘాపెట్టారు. అనుమానంతో కొందరిని విచారించారు. అంతేగానీ పోలీసుల సమస్యలపై కనీసం చర్చలు కూడా జరపకపోవడంతో పోరాడి సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. పోలీసు కుటుంబాలు, మాజీ పోలీసు అధికారులు బుధవారం రాత్రి సచివాలయాన్ని ముట్టడించాలని భావించాయి.

ఈ సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు సాయుధ బలగాలను దింపి ఆందోళనకారులను అరెస్ట్‌చేసేందుకు వాహనాలను పంపాలని ఆదేశించారు. బందోబస్తుకు సమ్మతించిన పోలీసులు వాహనా ల ఏర్పాటుకు విముఖత చూపినట్లు సమాచారం. ఈ కారణంగా ఉన్నతాధికారులు తమకు నమ్మకస్తులైన కొందరి చేత వాహనాలను సిద్ధం చేశారు. ఆందోళనకారుల్లో మీ కుటుంబ సభ్యులుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా,  ముట్టడి కారణంగా సచివాలయ అన్ని ప్రవేశమార్గాల్లో భారీఎత్తున పోలీసులను మొహరింపజేశారు. అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు సందర్శకుల ముసుగులో పోలీసుకుటుంబాలు చొరబడే అవకాశం ఉందనే అనుమానంతో గుర్తింపుకార్డులున్న సిబ్బందిని మినహా ఎవరినీ అనుమతించలేదు.

కానిస్టేబుళ్లకు బదులుగా ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు ప్రవేశద్వారాల వద్ద నిలబడ్డారు. అసెంబ్లీ బందోబస్తుకు అలవాటుగా వెళ్లే సిబ్బంది ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తమ పేరు ఇతర వివరాలను నమోదుచేసి వెళ్లాలనే షరతు విధించారు. ఇటువంటి పరిస్థితిలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం గురువారం ఉదయం 10 గంటలకు ఐదుగురు మాజీ పోలీసులు సచివాలయానికి చేరుకుని సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించాలని కోరారు. అయితే అక్కడున్న పోలీసులు అనుమతించలేదు. సీఎం కలవకుండా వెళ్లబోమని చెప్పడంతో వాగ్యుద్ధం నెలకొంది. దీంతో ఐదుగురు మాజీ పోలీసులను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు.

ఆ తరువాత మరికొంత మంది వచ్చి తాము మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్‌ బం«ధువును అనిచెబుతూ మరో మాజీ పోలీసు తదితరులు రాగా వీరిని కూడా అరెస్ట్‌చేశారు. ఇదిలా ఉండగా, సచివాలయం ఎదురుగా పార్కింగ్‌ ప్రదేశంలో దాక్కుని ఉండిన తంజావూరు జిల్లాకు చెందిన కొందరు మాజీ పోలీసులు, వారి కుటుంబాల వారు పెద్ద సంఖ్యలో దూసుకొచ్చి ముట్టడించారు. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన పోలీసులు వారందరినీ చుట్టుముట్టి అరెస్ట్‌చేయబోయారు. అయితే ఈ పోరాటమంతా మన కోసమే.. అరెస్ట్‌ చేస్తారా అని ఆందోళనకారులు అనడంతో మెత్తపడ్డారు. దీంతో సహాయక కమిషనర్‌ కలుగజేసుకుని సచివాలయాన్ని ముట్టడించిన 50 మందికి పైగా మాజీ పోలీసులు, పోలీసు కుటుంబ సభ్యులను అరెస్ట్‌చేశారు.

మరిన్ని వార్తలు