రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం అమలు చేస్తాం

4 Feb, 2014 02:32 IST|Sakshi
  • = డబ్బులిస్తే రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం
  •  = రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే.శివకుమార్
  •  సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. ఆయన సోమవారం బళ్లారి తాలూకా కుడితినిలోని బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (బీటీపీఎస్)  పరిశీలించారు. అంతకుముందు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి డీకేశీ మొట్ట మొదటిసారిగా బళ్లారి జిల్లాకు రావడంతో ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీకేశీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీని వారం రోజుల్లోగా అమలు చేస్తామన్నారు.

    సోలార్ విద్యుత్ స్టేషన్లు, గాలిమరలు తదితర విధానాలు అమలు చేస్తామన్నారు. నూతన విద్యుత్ పాలసీ అమల్లోకి రానుండటంతో రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు విద్యుత్ సమస్య రాకుండా చూస్తామన్నారు. ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అమలు చేసిన నియమాల ప్రకారం  ఎన్ని గంటలు విద్యుత్ ఇవ్వాలో అన్నే గంటలు సరఫరా చేస్తామన్నారు. అయితే నూతన విద్యుత్ పాలసీ అమలు చేయడం వల్ల డబ్బులు చెల్లించిన రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

    డబ్బులు చెల్లిస్తే ఏ రైతుకు ఎన్ని గంటలు విద్యుత్ కావాలో వారికి మీటర్లు ఏర్పాటు చేసి సరఫరా చేస్తామన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండటం వల్ల రైతులకు డబ్బులు తీసుకుని విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమ వుతోందన్నారు. బళ్లారి జిల్లా కుడితిని బీటీపీఎస్‌లో త్వరలో మూడవ యూనిట్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది ఆఖరిలోపు అందుకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

    రాష్ట్రంలో 3657 మెగావాట్ల జల విద్యుత్, 2800 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 3248 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిఅవుతోంద న్నారు. 900 మెగావాట్ల విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని, దీంతో రాష్ట్రంలో మొత్తం 13,697 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1836 మెగా వాట్లు విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఉడిపి విద్యుత్ కేంద్రం నుంచి 1200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో, కేంద్రం నుంచి వస్తున్న విద్యుత్ వల్ల ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కొరత లేకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, బీటీపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు