‘అన్నభాగ్య’పై అసంతృప్తి

22 Apr, 2016 02:03 IST|Sakshi

నాణ్యతలేని క్షీరభాగ్య
పౌరసరఫరాల శాఖ సర్వేలో  వెల్లడైన విషయాలు

 

బెంగళూరు:  ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నభాగ్య, క్షీరభాగ్య పథకాలపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. అన్నభాగ్యలో భాగంగా పేదలకు అందజేస్తున్న ఆహారపదార్థాలు పేదలకు ఏ మాత్రం సరిపోవడం లేదు, అంతేకాదు క్షీరభాగ్యలో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న పాలలో నాణ్యతా లోపం కారణంగా చిన్నారులు తాగలేని పరిస్థితి ఏర్పడింది. 2015-16 ఏడాదికి అన్నభాగ్య, క్షీరభాగ్య అమలు విషయమై డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 70 శాతం మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు 2013లో ప్రారంభమైన అన్నభాగ్య పథకం ద్వారా కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కేజీల ఆహారధాన్యాలు (4 కేజీల బియ్యం,  కేజీ గోధుమలు లేదా రాగులు) ఉచితంగా అందజేస్తున్నారు. వీటితో పాటు ఒక కేజీ చక్కెర, పామాయిల్, ఐదు లీటర్ల కిరోసిన్‌ను సబ్సిడీ ధరకు అందజేస్తున్నారు. ఇక ఇదే సందర్భంలో అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్న వారికి కుటుంబానికి 35 కేజీల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమలు, రాగులు కలుపుకొని) ఉచితంగా అందజేస్తున్నారు.


ఇక ఈ పథకాల అమలు తీరుకు సంబంధించి డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఒక్కో హోబలిలో(గ్రామంలో) మూడు బీపీఎల్ కుటుంబాలు, మూడు అంత్యోదయ అన్నయోజన ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలను ఈ సర్వేలో భాగస్వాములను చేశాయి. ఈ సర్వేలో 2,25 6బీపీఎల్ కుటుంబాలు, 2,232 అంత్యోదయ అన్నయోజన ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు భాగస్వాములయ్యాయి. కాగా, ఈ సర్వేలో పాల్గొన్న 75 శాతం బీపీఎల్ కుటుంబాలు, 50 శాతం అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు తమకు ప్రభుత్వం అందజేస్తున్న ఆహారధాన్యాలు ఏ మూలకు సరిపోవడం లేదని ఈ సర్వేలో వెల్లడించాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న కుటుంబాలన్నీ కూడా తమకు అందజేస్తున్న ఆహారధాన్యాలను మరో పది కేజీలకు పెంచాలని సర్వేలో కోరాయి.

 
నాణ్యత లేని పాలు..... ఇక చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ  ప్రారంభించిన ‘క్షీరభాగ్య’పై సైతం ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లో ఇస్తున్న పాలను చిన్నారులు తాగడానికి ఇష్టపడడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 748 పాఠశాలలు, అంగన్‌వాడీలకు చెందిన మొత్తం 3,740 మంది విద్యార్థులను ఈ సర్వేలో భాగస్వాములను చేయగా, వీరిలో నుండి 642 మంది విద్యార్థులు తాము అసలు పాలను తాగలేకపోతున్నామని చెప్పారు. క్షీరభాగ్యలో భాగంగా సరఫరా చేస్తున్న పాలలో నాణ్యత లోపించడం, పాలు వాసన వస్తుండడంతో తాము పాలను తాగలేకపోతున్నామని ఈ సర్వేలో విద్యార్థులు వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు