మూడో దశకు బెస్ట్ డిపో స్థలాలు

16 Dec, 2014 22:55 IST|Sakshi

సాక్షి, ముంబై: మెట్రో రైలు ప్రాజెక్టు మూడో దశకు ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ దశలో భాగంగా కొలాబా-బాంద్రా-సిబ్జ్ మధ్య నిర్మించనున్న మార్గానికి సంబంధించి బస్సు డిపోకు చెందిన స్థలాల్ని ఇచ్చేందుకు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ అంగీకరించింది. బెస్ట్ డిపో స్థలాలను ఇవ్వడం వల్ల బస్సు దిగిన ప్రయాణికులకు మెట్రో రైలు, అదేవిధంగా మెట్రో రైలు దిగిన ప్రయాణికులకు బెస్ట్ బస్సులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న బెస్ట్ సంస్థకు లాభం కూడా చేకూరనుంది.

నగరంలో అనేక సంవత్సరాల నుంచి బెస్ట్ బస్సులు, లోకల్ రైలు సంయుక్తంగా సేవలందిస్తున్నాయి. లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే బెస్ట్ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన ప్రయాణిలకు బస్సు దిగగానే రైలు సేవలు అందుతున్నాయి. ఇదే తరహాలో భూగర్భ మార్గంలో చేపట్టనున్న మెట్రో-3 ప్రాజెక్టు పనులకు బెస్ట్ డిపో స్థలాలను వినియోగించుకోవాలని ఎమ్మెమ్మార్సీఎల్ నిర్ణయించింది. ఈ విషయమై బెస్ట్ సంస్థ పరిపాలనా విభాగానికి విజ్ఞప్తి చేసింది. దీంతో హుతాత్మ చౌక్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఖాళీ ఉన్న స్థలాన్ని, సిబ్జ్, సేనాపతి బాపట్ మార్గ్‌పైనున్న అంబికా మిల్ బస్సు డిపో స్థలాలను ఇచ్చేందుకు బెస్ట్ అంగీకరించింది.

ఈ మూడు బెస్ట్ స్థలాల వద్ద భూగర్భంలో మెట్రో-3 రైలు స్టేషన్లు ఉంటాయి. భూగర్భంలో మెట్రో రైలు దిగిన ప్రయాణికులు పైకొచ్చి బెస్ట్ బస్సులు ఎక్కేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాదాపు 32.5 కి.మీ. భూగర్భ మెట్రో-3 ప్రాజెక్టులో మొత్తం 27 స్టేషన్లు ఉంటాయి. ఇదివరకు చేపట్టిన మెట్రో-1,2 ప్రాజెక్టు కారణంగా బెస్ట్‌కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.
 మొన్నటి వరకు బెస్ట్ బస్సుల్లో ప్రయాణించే వారంతా మెట్రో రైలు రావడంతో అందులోనే వెళుతున్నారు. దీంతో బెస్ట్ సంస్థ తీవ్రంగా నష్టపోతోంది.

అయితే మెట్రో-3 ప్రాజెక్టులో బెస్ట్ డిపో స్థలాలను వాడుకోవడం వల్ల రైలు దిగిన ప్రయాణికులకు బస్సులు అక్కడే అందుబాటులో ఉంటాయి. దీంతో రైలు దిగిన ప్రయాణికులు ఆటోలు, ట్యాక్సీలకు బదులుగా బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తారు. ఇదొక రకంగా బెస్ట్‌ను ఆర్థికంగా ఆదుకున్నట్లే అవుతుందని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్మెమ్మార్సీఎల్) భావిస్తోంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా