పోలీస్స్టేషన్ పై గ్రామస్తుల దాడి

12 Oct, 2016 16:12 IST|Sakshi
పోలీస్స్టేషన్ పై గ్రామస్తుల దాడి

పండుగ రోజు జరిగిన గొడవకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  పోలీసుల వేధింపులే అతడి మరణానికి కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

గామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కరవత్తుల శ్రావణ్(24) సహా మరికొందరిని కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా పోలీసులు అతడిని వేధించారు. మళ్లీ బుధవారం స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామానికి వెళ్లిన శ్రావణ్ రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి శ్రావణ్ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. వేధింపులే అతడిని బలి తీసుకున్నాయని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారు.


ఎస్పీ సీరియస్..
కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో యువకుడి ఆత్మహత్య, పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తుల దాడిని పోలీస్ బాస్ సీరియస్ గా తీసుకున్నారు.  శ్రవణ్  మృత దేహంతో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తోపాటు గ్రామస్తులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు అధికారులతో మాట్లాడారు.

స్పందించిన ఎస్పీ కమలాసన్‌రెడ్డి వెంటనే మానకొండూర్ చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన ఎస్సై వంశీకృష్ణతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల సాయం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.

మరిన్ని వార్తలు