జిల్లాలో యూనివర్సల్ హెల్త్‌కేర్

10 Oct, 2013 03:57 IST|Sakshi

రాయచూరు, న్యూస్‌లైన్ : అందరికీ ఆరోగ్యం హక్కు కల్పిస్తూ 12వ పంచవార్షిక ప్రణాళిక కింద యూనివర్సల్ హెల్త్ కేర్‌ను రాయచూరు జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ తెలిపారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం, జెడ్పీ తదితర శాఖల ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు.

2005లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ఆరోగ్య అభియాన్ అమలు వల్ల ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. స్వాతంత్య్రం అనంతరం అత్యధిక నిధులను బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయించారన్నారు. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు దోహద పడుతుందన్నారు.

గ్రామ ఆరోగ్యం రక్షించడం ద్వారా ఆరోగ్య సేవలను గ్రామ సమితుల ద్వారా అమలు చేసి ఆశా కార్యకర్తల సేవలు అందుకుని తగినంత నిధులు పొంది ఆరోగ్య రంగ సమూల మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. నగర ప్రాంత ప్రజల ఆరోగ్య సేవలకు నగర ఆరోగ్య మిషన్ పథకాన్ని జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించేందుకు తగినన్ని నిధులు వ్యయం చేస్తామన్నారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి అత్యాధునిక వైద్యం అందాలని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సమితి సిఫారస్సులను జారీ చేసేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకున్నామన్నారు.

మైసూరు, రాయచూరులలో యూనివర్సెల్ హెల్త్‌కేర్ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్య సేవలు పెంచడంతో పాటు ల్యాబ్ అంటు వ్యాధులను నియంత్రించేందుకు పథకాలను రూపొందించామన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉన్నత అధికారి డాక్టర్ సునీల్, ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడు శరణప్ప, మహదేవమ్మ, జిల్లాధికారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు