శిశువు తొడల్లో మంటలు

19 Jan, 2015 02:24 IST|Sakshi
శిశువు తొడల్లో మంటలు

 శిశువు తొడల్లో మంటలు వచ్చి చర్మం కాలిపోయే వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదు. ఇది వైద్య వర్గాలకు ఓ సవాల్‌గా మారింది. విల్లుపురం నుంచి ఆ శిశువును కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో కెమెరా పర్యవేక్షణలో ఐదుగురు వైద్య బృందం ఆ శిశువుకు చికిత్స అందిస్తోంది.
 
 సాక్షి, చెన్నై :  రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మైలం సమీపం నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో నర్మద పెద్దది. కుమారుడు రాహుల్ పుట్టగానే వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలిపోవడంతో మైలం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. రాజేశ్వరి, కర్ణన్ దంపతులకు మళ్లీ వింత శిశువు జన్మించిన సమాచారం మీడియాల్లో చూసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. సీఎం పన్నీరు సెల్వం ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఆ శిశువు పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.
   
 ప్రత్యేక వార్డు :  ఆ శిశువును మైలం ఆస్పత్రి నుంచి శనివారం రాత్రి చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఆ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. ఆ వార్డులో ఆ శిశువును  ఫోకస్  చేస్తూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలిన గాయాలకు వైద్య పరీక్షలు అందించారు. మెరుగైన వైద్య పరీక్షలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వైద్య బృందం అందిస్తోంది. ఆ ఆసుపత్రి డీన్ గుణ శేఖరన్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఆ శిశువును 24 గంటల పాటుగా పరీక్షిస్తోంది. మంత్రి విజయ భాస్కర్ ఆ శిశువును పరిశీలించారు. తల్లిదండ్రుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆందోళన వద్దని, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ వేదనను పరిగణించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
 
 అంతు చిక్కని వింత : గతంలో రాహుల్ శరీరంలో మళ్లీ మంటలు రాకుండా కట్టడి చేసిన వైద్యులు, ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో తలలు పట్టుకుంటున్నారు. అంతు చిక్కని ఈ వ్యాధి మళ్లీ రాహుల్ సోదరుడిని వెంటాడడంతో పరిశోధనల్ని తీవ్రతరం చేశారు. రాజేశ్వరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల్ని నిర్వహించి పరిశోధనకు నిర్ణయించారు. ఆమెలో ఏదేని లోపం ఉన్నదా? తద్వారా, ఈ మంటలు వస్తున్నాయూ? అన్న అన్వేషణ మొదలైంది. రాజేశ్వరి, కర్ణన్ స్వగ్రామంలో అయితే, కొత్త ప్రచారం ఊపందుకుంది. తమ గ్రామంలో దుష్ట శక్తి తిష్ట వేసిందని, ఆ కుటుంబంలో పుట్టిన మగ బిడ్డల మీద ఆ శక్తి తన ఆగ్రహాన్ని చూపుతోందన్న ప్రచారం బయలు దేరడం కొసమెరుపు.

 

>
మరిన్ని వార్తలు