పోస్టుమార్టంకు అనుమతి

23 Sep, 2016 02:26 IST|Sakshi
పోస్టుమార్టంకు అనుమతి

ప్రైవేటు వైద్యుడికి అనుమతి నిరాకరణ
 ఎయిమ్స్ వైద్యుడ్ని నియమించుకోవచ్చు
  హైకోర్టు ఆదేశం

 
 సాక్షి, చెన్నై : రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు తగ్గ అనుమతిని మద్రాసు హైకోర్టు జారీ చేసింది. అయితే, రామ్‌కుమార్ తండ్రి పరమశివం విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది. ఈనెల 27లోపు పోస్టుమార్టం నిర్వహించే విధంగా గురువారం న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ముమ్మాటికి హత్యేనంటూ రామ్‌కమార్ తండ్రి పరమ శివం, న్యాయవాది రామరాజ్ ఆరోపించే పనిలో పడ్డారు.
 
  అలాగే, పోస్టుమార్టం ప్రైవేటు వైద్యుడి పర్యవేక్షణలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం కావడంతో చివరకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు మార్చారు. ఆ మేరకు న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం పిటిషన్‌ను విచారించింది. వాదన అనంతరం ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడ్ని అనుమతించబోమని బెంచ్ స్పష్టం చేసింది. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుప్రతి వైద్యుడి పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించుకోవచ్చని సూచించింది.
 
 ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడితో కలిసి పోస్టుమార్టంను ఈనెల 27లోపు నిర్వహించాలని, ఈ ప్రక్రియ పూర్తిగా వీడియో చిత్రీకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిని పిటిషనర్ వ్యతిరేకిస్తూ శుక్రవారం అప్పీలుకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరపడంలో జరుగుతున్న జాప్యం, ఈ మరణం వెనుక మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళనకు నిర్ణయించామని ప్రకటించారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా