అఖిలపక్షం చిచ్చు

24 Oct, 2016 01:58 IST|Sakshi

 సాక్షి, చెన్నై:  డీఎంకే అఖిలపక్షం పిలుపు మక్కల్ ఇయక్కంలో చిచ్చు రగిల్చేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో చోటు చేసుకుంటున్నాయి. అఖిల పక్షానికి దూరం అని ఎండీఎంకే నేత, ఇయక్కం కన్వీనర్ వైగో ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇక, సీపీఎం, సీపీఐలు సైతం పునరాలోచించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
 రాష్ట్రం ప్రభుత్వం అఖిలపక్షానికి స్పందించని దృష్ట్యా, కావేరి హక్కుల సాధనకు డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వ్యతిరేకంగా బీజేపీ విమర్శలు గుప్పించే పనిలో పడగా, ఇదో ఉప ఎన్నికల స్టంట్ అని అన్నాడీఎంకే ప్రకటించింది. పీఎంకే నేత రాందాసు ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించగా, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్ లో మౌనంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక, కాంగ్రెస్, మనిద నేయ మక్కల్‌కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించాయి.
 
 రైతు సంఘాలు కొన్ని ఇప్పటికే మద్దతు ఇచ్చి ఉన్నాయి. ఇక, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన మక్కల్ ఇయక్కం ఆ సమావేశానికి దూరం అని కన్వీనర్ వైగో ప్రకటించారు. అయితే, వైగో ప్రకటన ఆ కూటమిలో చిచ్చు రగిల్చేందుకు ఆస్కారాలు కన్పిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఆ ఇయక్కంలోని వీసీకే నేత తిరుమావళవన్ స్పందించడం గమనార్హం.
 
 తిరుమా ఎటో : కావేరి వివాదం అన్నది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన సమస్య కాదు అని, ఇది అందరి సమస్య, దీని సాధనకు అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ, తిరుమావళవన్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, అఖిల పక్షం బాధ్యతల్ని ప్రధాన ప్రతిపక్షం స్వీకరించాలని తాను గతంలో డిమాండ్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.  ఎవరు ఎలా వెళ్లినా, తాను పట్టించుకోనని, అయితే, అందరి సమస్య కాబట్టి, అఖిలపక్షం విషయంగా సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ మేరకు పార్టీ వర్గాలతో సమాలోచనకు తిరుమావళవన్ పిలుపు నిచ్చారు.ఆ సమావేశం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాగా, అందరి సమస్య కాబట్టి, డీఎంకే పిలుపునకు ఆయన స్పందించవచ్చన్న భావన బయలు దేరింది. ఇక, ఇదేఇయక్కంలో ఉన్న సీపీఎం, సీపీఐలు పునరాలోచనలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
 పునరాలోచన :
 కావేరి హక్కుల సాధన కోసం ఆది నుంచి ఉద్యమిస్తున్న రైతు సంఘాల్లో అత్యధికం వామపక్షాలకు అనుబంధంగా ఉన్నవే. సీపీఎం, సీపీఐ గొడుగు నీడన ఉన్న రైతు సంఘాలు కావేరి హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, వారికి మద్దతుగా డీఎంకే గళం విప్పింది. అలాగే, రైతు సంఘాల అఖిల పక్ష సమావేశానికి డీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఉద్యమాల్లో , ఆందోళనల్లో స్వయంగా ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ సైతం పాల్గొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అదే నినాదంతో డీఎంకే అఖిల పక్ష సమావేశానికి పిలుపు నివ్వడం సీపీఎం, సీపీఐ వర్గాలను ఇరకాటంలో పడేసినట్టు సమాచారం.
 
 మక్కల్ ఇయక్కం డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ఓ కూటమిగా పరిగణించవచ్చు. అయితే, రైతు సమస్యల విషయంలో డీఎంకే కలిసి వస్తున్న నేపథ్యంలో, తాము మాత్రం దూరంగా ఉంటే, ఏదేని విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా..? అన్న పరిశీలనలో సీపీఎం, సీపీఐ వర్గాలు పడ్డాయి. తమ అనుబంధ రైతు సంఘాలు డిఎంకే అఖిలపక్షానికి హాజరై, తాము హాజరు కాకుంటే, అన్నదాతల వ్యతిరేకతకు గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వైగో నిర్ణయాన్ని పునస్సమీక్షించే పనిలో పడ్డట్టు సమాచారం.
 
  అయితే,  ఇయక్కం కన్వీనర్‌గా ఉన్న వైగో ప్రకటించి ఉన్న నిర్ణయాన్ని వీసీకే, సీపీఎం, సీపీఐలు ధిక్కరించిన పక్షంలో చిచ్చు ఆ ఇయక్కంలో రగిలినట్టే. కాగా, డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని ఈనెల 25న కాకుండా, మరో తేదీలో నిర్వహించి ఉండాల్సిందని ఓ వామపక్షవాది వ్యాఖ్యానించారు. ఈనెల 26వ తేదీ నుంచి ఉప ఎన్నికల నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టనుండడం, ఆ ముందు రోజు అఖిలపక్షం పేరుతో అందరూ ఒకే చోట చేరిన పక్షంలో రాజకీయంగా ఇరకాటంలో పడాల్సి వస్తుందేమో అన్న ఆందోళన తమ నేతల్ని వెంటాడుతున్నట్టుగా ఆ వామపక్ష నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు