ఈ అభిమానం చాలు

29 Sep, 2013 00:19 IST|Sakshi

దాదర్, న్యూస్‌లైన్: ఉపాధి కోసం ముంబై నగరానికి వచ్చి స్థిరపడి అనేక రంగాల్లో రాణిస్తున్న తెలుగువారి గురించి తెలిసి ఎంతో ఆనందం కలిగిందని  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. కామాటిపుర ప్రాంతంలో ఆధునీకరించిన అఖిల పద్మశాలి సమాజం హాలును శనివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడివారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఆకట్టుకున్నాయన్నారు. ‘ఈ సభా ప్రాంగణానికి వచ్చే సమయంలో ఎందరో నా అభిమానులైన చిన్నారులు, మహిళలు, యువకులు జేజేలు పలకడం ఎంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’ అని ఉద్వేగంతో మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేనేత కార్మికులకు, రైతులకు రుణాలు మాఫీ చేసే విధంగా ప్రయత్నించానని తెలిపారు.  సదా మీ ప్రేమాభిమానాలు ఆశిస్తున్నానని ముకుళిత హస్తాలతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అఖిల పద్మశాలి సమాజం  ట్రస్టీ, శిక్షణ సమితి చైర్మన్ సామల పురుషోత్తం మాట్లాడుతూ సమాజం తరఫున తెలుగువారికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
 
ప్రతి ఏటా శ్రీ మార్కండేయ మహాముని జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, రథయాత్రలను నిర్వహిస్తున్నామన్నారు. హోళి ఉత్సవాలు, ఉగాది, నారళి పౌర్ణిమ పండుగలు, ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ సమాజంలో దాదాపు 3 వేలకు పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రి మిలింద్ దేవరా, శాసన సభ్యుడు అమీన్ పటేల్, కాంగ్రెస్ నేత భాయి జగతాప్, స్థానిక కార్పొరేటర్ షహానా రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
 
ఘనంగా సన్మానం
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవిని వర్లిలోని  జాగృతి స్పోర్ట్స్ మండల్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని తెలుగు ప్రజలు ఐకమత్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారనీ హర్షం వెల్లిబుచ్చారు. తొలుత సంస్థకు చెందిన ప్రధాన కార్యదర్శి విజయ్ ఎలిగేటి  ముఖ్య అతిథి చిరంజీవి, కేంద్ర మంత్రి మిలింద్ దేవ్‌రా తదితర ప్రముఖులకు స్వాగతం పలికారు.
 

మరిన్ని వార్తలు