‘సేవ్’కు విశేష స్పందన!

25 Aug, 2014 22:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వాలు, నగర పోలీసులు విధిస్తున్న ఆంక్షల కారణంగా సిటీ నైట్‌లైఫ్ నాశనమైపోతోందని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. రోజంతా ఆఫీసులు, కంపెనీల్లో బిజీబిజీగా గడిపే ఉద్యోగులు కాస్త విశ్రాంతి కోసం సరదాగా గడిపేందుకు పబ్బులకు, క్లబ్బులకు వస్తుంటారని, పబ్బులు, క్లబ్బులపై ఆంక్షలు విధించడం వల్ల నైట్‌లైఫ్‌ను డేలైఫ్‌గానే ఆదరాబాదరాగా గడిపేయాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ డిమాండ్‌కు మద్దతు కూడగట్టేందుకు ఏకంగా ఓ ఫేస్‌బుక్ పేజీని  తెరిచారు. అంతటితో ఆగారా...? లేదు.. ఆంక్షలను ఎత్తి వేయాలని..., రాత్రంతా పబ్బులు, క్లబ్బులు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి, లెఫ్టినెంట్ గవర్నర్, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులకు పిటిషన్  పెట్టుకు
 న్నారు.
 
 వివరాల్లోకెళ్తే...
 చీకటిని అవకాశంగా చేసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నని, నగరంలోని క్లబ్బులను, పబ్బులను నిర్ణీత సమయానికే మూసివేయాలనే డిమాండ్ మేరకు క్లబ్బులు, పబ్బుల నిర్వహణ సమయంపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 12.30 గంటల వరకు మాత్రమే వీటిని తెరిచి ఉంచేందుకు అనుమతిని ఇవ్వగా మరికొన్నింటికి రాత్రి 1 గంట వరకు అనుమతిని ఇచ్చారు. క్లబ్బుల్లో తప్పతాగి.. తాగిన మత్తులో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
 
 ఇలాంటివి కొన్నయితే చీకటిని అవకాశంగా మలుచుకొని అబలలపై, అమాయకులపై కామాంధులు ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు మరికొన్ని. దీంతో ఆంక్షల కారణంగా కొంతమేరకైనా నేరాలు తగ్గుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ దేశాలను జారీ చేసింది. అయితే నేరాలకు పాల్పడే మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడైనా పాల్పడతారని, ప్రజల మైండ్ సెట్లలో మార్పు రావాలని నెటిజన్లు చెబుతున్నారు. నగరానికి చెందిన అశుతోష్ శర్మ.. సామాజిక మాధ్యమాలను ఆయుధంగా చేసుకొని ఈ విషయమై తన స్వరాన్ని వినిపించాడు. నగరంలోని చాలా ప్రాంతాల్లో నైట్ క్లబ్బులు, పబ్బులు రాత్రి 1 గంటకే మూతడడంతో తాము ఆహ్లాదంగా గడపలేకపోతున్నామని, తనలాగే చాలామంది సరదాగా సమయాన్ని గడపలేకపోతున్నారంటూ ఓ కామెంట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. జూలై 30న చేసిన ఆయన పోస్ట్‌లకు చాలామంది నుంచి స్పందన రావడంతో ‘సేవ్ ఢిల్లీస్ నైట్‌లైఫ్’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీని తెరిచాడు.
 
 దేశ రాజధాని నైట్‌లైఫ్‌ను కాపాడాలంటూ ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆన్‌లైన్‌లోనే ఓ పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపించింది. పిటిషన్ పెట్టిన కొన్ని గంటల్లోనే దాదాపు 1,500 మంది మద్దతుగా సంతకాలు చేశారు. 6,000 మందికిపైగా నెటిజన్‌లు లైక్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఈ పిటిషన్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అంతేసంఖ్యలో మద్దతు పలుకుతూ సంతకాలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ను శర్మ ఊరికే వదిలేయకుండా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు పంపాడు. కొంతమంది పార్లమెంట్ సభ్యులకు, సీనియర్ ప్రభుత్వ అధికారులకు కూడా పంపాడు.
 

>
మరిన్ని వార్తలు