ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత

29 Dec, 2013 03:35 IST|Sakshi

రాయచూరు రూరల్ , న్యూస్‌లైన్ : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన రాయచూరు డివిజన్‌లో విషాదం నింపింది. మృతులు, గాయపడిన వారిలో రాయచూరు డివిజన్‌లోని రాయచూరు, గుల్బర్గా, యాదగిరి, బీదర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. రాయచూరు టిప్పుసుల్తాన్ వీధిలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. డయాగ్నస్టిక్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యతేష్‌రాహి భార్య ఆశ్రా(31), ఆమె తమ్ముడు ఇబ్రహీం రాహి(31), ఆమె కుమారుడు నిషారాహిలు(3) మృతి చెందారు.

ఇబ్రహీం రాహి రాయచూరులో రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇబ్రహీం బెంగళూరులో టాటా కంపెనీలో విధులు నిర్వహించేవాడు. డాక్టర్ ఆస్రా పరీక్షలు రాసేందుకు వెళ్లి ముగ్గురు తిరిగి వస్తుండగా వృుత్యువాత పడ్డారు. మృతుల్లో రాయచూరు డివిజన్‌కు చెందిన కృష్ణమూర్తి(70), పద్మిని(61), లలిత(61), రాహుల్(25), యాదగిరికి చెందిన సంజీవ్ కోలార్ (41) ఉన్నారు. అదే బోగిలో ప్రయాణించిన రాయచూరు జిల్లా సహకార సంఘం అధ్యక్షులు సుభాష్ పాటిల్ శ్యావంతగెర ఆచూకీ తెలియడం లేదు. సేడం తాలూకా అడకి జెడ్పీ మాజీ సభ్యులు భీమయ్య కూడా ఈ ప్రమాదంలో మరణించారు.  
 
విధి ఆడిన వింత నాటకం...
 
గుల్బర్గ జిల్లా సేడం తాలూకా అడకి మాజీ జడ్‌పీ సభ్యుడు భీమయ్య మానప్ప శాబాదకర్ కుమార్తెతో కలసి సేడం తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడి కుమార్తె పెళ్లికి హాజరై తిరిగి వస్తూ ఈ రెలైక్కారు. భీమయ్యకు మాత్రం ఏసీ బీ-1 బోగీలో సీటు లభించింది. కుమార్తె వేరే బోగీలో కూర్చుంది. రాత్రి 12.30 గంటలప్పుడు భీమయ్య తన కుమార్తెకు ఫోన్ చేసి, పొద్దున ఇద్దరూ రైలు దిగి కలసి వెళదామని చెప్పారు. వేకువ జామున షార్ట్ సర్క్యూట్ వల్ల బోగీ దగ్ధం కావడంతో ఆయన పూర్తిగా దహనమయ్యారు. కుమార్తె ఆయన మృత దేహాన్ని గుర్తించింది. అయినప్పటికీ డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతనే వృుతదేహాన్ని అప్పగించనున్నారు. భీమయ్య రాయచూరు జిల్లా లింగసుగూరు ఎమ్మెల్యే మానప్ప వజ్జల్ సమీప బంధువు.
 

మరిన్ని వార్తలు