వేర్వేరు ఘటనల్లో ముగ్గురి హత్య

8 Oct, 2013 04:42 IST|Sakshi
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. తిరువారూర్ జిల్లా కేక్కరై ప్రాంతానికి చెందిన ఆల్‌బర్ట్(24), సతీష్‌కుమార్(23) బంధువులు. వీరిద్దరూ కోవై వడవెళ్లి ఈబీ కాలనీలో ఉంటూ కూలి పనులు చేస్తున్నారు. ఆదివారం మరుదమలై రోడ్డు నావలూర్ విభాగంలో ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో వారిద్దరికీ హఠాత్తుగా వాగ్వివాదం ఏర్పడి  ఘర్షణ పడ్డారు. ఆగ్రహం చెందిన సతీష్‌కుమార్ సమీపంలో బస్‌స్టాప్ నుంచి కదులుతున్న బస్సు ముందు ఆల్‌బర్ట్‌ను తోసేశాడు. దీంతో ఆల్‌బర్ట్‌పై బస్సు చక్రం ఎక్కి దిగడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు అద్దాలపై రాళ్లు విసిరి సతీష్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన గురించి కండక్టర్ దినేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడవళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
 ఇద్దరు యువకుల హత్య: మదురై సెల్లలూర్ ఠాగూర్ నగర్‌కు చెందిన గోపాల్ కుమారుడు సెల్వం(21). సెల్లలూర్ కనమ్మాయి ప్రాంతంలో కత్తితో దాడి చేయబడి సోమవారం ఉదయం శవంగా పడిఉన్నాడు. సమాచారం అందుకున్న సెల్లలూర్ ఇన్‌స్పెక్టర్ దురై పాండియన్ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్షకు తరలించారు. పోలీసుల విచారణలో మిత్రులతో మద్యం తాగి, ఆపై ఏర్పడిన ఘర్షణలో సెల్వం హత్యకు గురైనట్టు తెలిసింది. అలాగే మదురై సెల్లలూర్ శివగామి వీధికి చెందిన ఆర్ముగం కుమారుడు కాళిముత్తు(22). ఆదివారం రాత్రి పాండియన్ నగర్ సమీపంలో నడిచి వస్తుండగా ఒక ముఠా అతడ్ని అడ్డుకొని కత్తులతో దాడి చేసింది. తీవ్ర గాయాలైన కాళిముత్తు మదురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
మరిన్ని వార్తలు