పత్తాలేని పసివాళ్లు!

12 Nov, 2013 00:59 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్: చిన్నారుల అదృశ్యం ఘటనలు పుణే నగరంలో ఆందోళనకరస్థాయి లో పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో పుణేలో ప్రతి రోజు సరాసరి ముగ్గురు చిన్నారులు తప్పిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.  తప్పిపోయిన పిల్లల వివరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. పిల్లలను వెతకడానికి ఈ వెబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతోందని దర్యాప్తు సిబ్బంది చెబుతున్నారు. ఎవరి పిల్లలైనా అదృశ్యమైతే ఇందులో వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.  తప్పిపోయిన వారిలో ఈ వైబ్‌సైట్ ద్వారా కనీసం 50 శాతం పిల్లలను వెదకడానికి వీలవుతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అదృశ్యమవుతున్న వారిలో 25 శాతం మంది... ఇంట్లో కలహాల వంటి చిన్న కారణాలతో  వెళ్లిపోయినవారేనని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. 20 మంది శాతం పిల్లలు ఎలాంటి కారణమూ లేకుండా ఇల్లు వదిలి వెళుతున్నారు. వీరిలో 15 నుంచి 20 ఏళ్ల వయస్సు గల వారు ఎక్కువగా ఉన్నారని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్ సంస్థ సభ్యుడు అభయ్ కిరాణే తెలిపారు.
 
 అదృశ్యమైన పిల్లలను వెతకడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ‘తేరా బచ్చా మేరా బచ్చా’ అనే సామాజిక సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘బచ్‌పన్ బచావ్ ఆందోళన్’ ఎన్జీఓ కూడా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. దీనిపై స్పందించిన కోర్టు 18 ఏళ్ల వరకు వయసున్న వాళ్లు అదృశ్యమైనా ‘మిస్సింగ్’ కేసులుగా పరిగణించాలని ఆదేశించిందని సంజయ్ నికమ్ అనే పోలీసు అధికారి తెలిపారు. పుణే పోలీసుల గణాంకాల ప్రకారం.. తప్పిపోయిన ప్రతి 10 మంది పిల్లల్లో ముగ్గురు ఆచూకీ తెలియడం లేదు. 2009లో 1,017 మంది పిల్లలు అదృశ్యమవగా, వీరిలో 300 మంది పిల్లల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. 2010లో 1,106 పిల్లలు తప్పిపోగా 371 మంది పిల్లల ఆచూకీ తేలనేలేదు. 2011లో 1,261 చిన్నారులు తప్పిపోగా, 490 మంది ఏమయ్యారో తెలియరాలేదు. గత ఏడాది 1,254 పిల్లలు తప్పిపోగా వీరిలో 360 మంది పిల్లల ఆచూకీ లభించలేదు. 2013 జనవరి నుంచి సెప్టెంబరు నాటికి మొత్తం 1,280 మంది పిల్లలు తప్పిపోగా వీరిలో 713 మంది పిల్లలు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది పిల్లలు అదృశ్యమవుతున్నట్లు అంచనా.  
 
 ఇంట్లో వేధింపులు, వాదులాటలు, పరీక్షల ఒత్తిడి వంటివి చిన్నారుల అదృశ్యానికి ముఖ్య కారణాలని పోలీసులు అంటున్నారు. పిల్లలను వెతికేందుకు పోలీసులు ప్రత్యేకంగా కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ ఆదేశాలు కార్యరూపం దాల్చలేదని సీయర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను పట్టుకొని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పోలీసు స్టేషన్లలో తిరుగుతుంటారు. చిన్నారులు తప్పిపోవడానికి కుటుంబ సభ్యుల ప్రవర్తనే ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. వారికి అన్ని విధాలా ధైర్యం చెప్పి భయాందోళనలు దూరం చేయాలని సూచిస్తున్నారు. పుణేలోని ఓ అనాథాశ్రమం నుంచి 2011లో ఏకంగా 18 మంది చిన్నారులు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. పోలీసుల నుంచి సాయం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు కొందరు సంఘంగా ఏర్పడి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇలా కొడుకు పోగొట్టుకున్న ఒక బాధితుడు మాట్లాడుతూ ‘పోలీసుల సమయం వీఐపీలకు భద్రత కేటాయించడానికే సరిపోతోంది. ఇలాంటి ఫిర్యాదులను వారు పట్టించుకోవడం లేదు. చిన్నారులను కిడ్నాప్ చేసి వ్యభిచారం, యాచకవృత్తిలోకి దింపే ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయి. కొందరు బాలలను కిడ్నాప్ చేసి యాచక ముఠాలకు విక్రయిస్తున్నారు. పిల్లలతో నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా చేయించే ముఠాలు కూడా ఉన్నాయి’ అని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు