-

కశ్మీరీ గేట్ ప్రాంతంలో కూలిన భవనం

16 Oct, 2013 00:59 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : వారం రోజుల వ్యవధిలో మరో భవనం కుప్పకూలింది. దేశ రాజధానిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ఢిల్లీవాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ పురాతన భవనం కూలుతుందోనని వాటిల్లో ఉంటున్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కూలుతున్న భవనాల్లో ఎంతో మంది సజీవ సమాధి అవుతున్నా పాలకుల్లో, అధికారుల్లో చలనం కలగడం లేదు. ఇక  ప్రభుత్వం, ఎంసీడీలు తలోదారిగా వ్యవహరిస్తున్నాయి. తప్పు మాదికాంటే మాది కాదంటూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
కంపిస్తే ఖతమే:
భూకంపాల జోన్-4లో ఢిల్లీ ఉంది. కాస్త తీవ్రత అధికంగా ఉన్న భూకంపం వచ్చినా నగరంలోని ఎన్నో భవనాలు పేకమేడల్లా కూలడం ఖాయం. నగరంలోని పురాతన భవనాల పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను సైతం అధికారులు కూలగొట్టకపోవడం స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. తాజాగా మంగళవారం ఉదయం కశ్మీరీగేట్ ప్రాంతంలో భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. సరిగ్గా వారం క్రితం ఈ నెల 9న నార్త్ ఢిల్లీలోని బారా హిందూరావు ప్రాంతంలో 150 ఏళ్ల పురాతన  మూడు అంతస్తుల భవనం కూలి తండ్రీకొడుకులు మరణించిన విషయం తెలిసిందే. చాందినీచౌక్ ప్రాంతంలో ఇవి కాకుండా ఈ ఏడాది ఆగస్టులో, 2011 సెప్టెంబర్‌లోనూ పురాతన భవనాలు కూలిన ఘటనలు నమోదయ్యాయి. పాత ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పురాతన భవనాలు ప్రమాదకరంగా మారాయి. భూకంపాల జోన్‌లో ఉండడంతో చిన్నపాటి కదలికలు, కుదుపులకు సైతం అవి నేలమట్టం అయ్యేంతగా ధ్వంసమై ఉన్నట్టు అధికారిక సర్వేల్లో వెల్లడైంది.
 
తప్పుకునే యత్నం:
తరచూ భవనాలు కూలుతున్న ఘటనలు జరుగుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పంతాలు మానడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఎంసీడీల్లో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు షీలాసర్కార్‌పై విమర్శలు గుప్పిస్తారు. ఢిల్లీప్రభుత్వం సైతం ఎంసీడీలపై తప్పు నెడుతూ కాలం వెళ్లదీస్తోంది. వాస్తవానికి ఢిల్లీ మాస్టర్‌ప్లాన్-2021లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది. దీన్ని షాహజానాబాద్ రీ-డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎస్‌ఆర్‌డీసీ) ఆధ్వర్యంలో నిధులను విడుదల చేయాల్సి ఉంది. వీటిని ఎంసీడీ పరిధిలో ఖర్చుచేసి పునరాభివృద్ధి పనులు కొనసాగించాలి. కానీ రాజకీయ కారణాలతో ఢిల్లీ సర్కార్, ఎంసీడీల మధ్య సమన్వయం లోపిస్తోంది. పాలకుల పాపానికి ప్రజలు బలి అవుతున్నారన్న విమర్శలున్నాయి.
 
అధికారుల నిర్లక్ష్యం:
ఈ నెల 9న నార్త్ ఢిల్లీలోని బారా హిందూరావు ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో నఖ్వి, అతడి కుమారుడు మరణించిన విషయం తెలిసిందే. నఖ్వి పక్కన ఉన్న ఇంట్లో అక్రమ కట్టడాల కోసం జరుగుతున్న తవ్వకపు పనులతో నఖ్వీ ఇంట్లో గోడల బీటలు వారాయి. ఈ విషయమై అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గతంలో జరిగిన ప్రమాదాల్లోనూ అధికారుల నిర్లక్ష్యం ఉందని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు కేవలం సర్వేలకే పరిమితమవుతున్నారు మినహా చర్యలు తీసుకోవడం లేదు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాన్‌సూన్ సర్వే(2013-14)లో ప్రమాదాల అంచున ఉన్న భవనాలను గుర్తించారు. సిటీజోన్‌లో 15, సదర్‌బజార్‌లో 12, పహాడ్‌గంజ్‌లో 48, చాందినీచౌక్‌లో 3, బల్లిమరన్ 3, సీతరాంబజర్ 1, కరోల్‌బాగ్ 1 ప్రమాదకర భవనాలన్నాయని నిర్ధారించారు. కానీ క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందుకు స్థానిక నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లు కారణమవుతున్నాయి. ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిసీ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తమను అడ్డుకుంటున్నారని అధికారులు సైతం వాపోతున్నారు.
 
ముగ్గురి మృతి
కశ్మీరీ గేట్‌లోని పంజా షరీఫ్ ప్రాంతంలో ఒక పురాతన  భవనం కూలిపోవడంతో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. ఈ ఘటనపై ఉత్తర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ భవనం కూలడానికి దారి తీసిన పరిస్థితులపై  సివిల్ లైన్స్ జోన్ ఇన్‌చార్జ్, అదనపు కమిషనర్ అధ్యయనం చేసి కమిషనర్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఆంగ్లేయుల కాలం నాటిదైన ఈ భవనంలోని రెండు గదుల్లో నలుగురు సభ్యులున్న కుటుంబం ఉంటోందని ఎమ్సీడీ తెలిపింది. ఒక గది పైకప్పుతో పాటుకొంతభాగం గోడ  మంగళవారం ఉదయం కూలిందని పేర్కొంది. అయితే భవనం శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారని,  ఇద్దరు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.
 
మరిన్ని వార్తలు