మూడేళ్లయినా ముగింపేదీ?

24 Dec, 2013 02:19 IST|Sakshi
చెన్నై నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాం తాలను అనుసంధానం చేస్తూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన వ్యాసార్పాడీ వంతెన నిర్మాణం అసలు పూర్తయ్యే నా? అనే అనుమానం రేకెత్తిస్తోంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద కాలం మించిపోగా నిర్మాణ పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. పనులు ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా వంతెన మాత్రం ముగింపు దశకు  చేరుకోవడం లేదు. 
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నై నగరం నలువైపులా పారిశ్రామిక విస్తరణతో వర్ధిల్లుతుండగా ఉత్తర చెన్నైలో సైతం అనేక పారిశ్రామికవాడలు, కాలనీలు, మధ్యతరగతి కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. మాధవరం, కొడుంగయ్యూర్, కన్నదాసన్ నగర్, పుళల్, సెంగుడ్రం, మనా లి, మాత్తూరు తదితర ప్రాంతాల ప్రజలు దక్షిణ చెన్నై వైపున్న సెంట్రల్, హైకోర్టు, బ్రాడ్‌వే, సైదాపేట, గిండీ ప్రాంతాలకు వ్యాసార్పాడి మీదుగానే వెళ్లాలి. అయితే వర్షాకాలంలో వ్యాసార్పాడిని కలిపే పెరంబూరు, గణేష్‌పురం ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జిల్లో నీరుచేరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.47.06 కోట్ల అంచనాతో 2010లో పనులు ప్రారంభించి 2013 నాటికి పూర్తిచేయాలనే ఒప్పందం జరిగింది.
 
 ప్రజాపనుల శాఖ నేతృత్వంలో నిర్మాణపు పనులు సాగేలా ప్రభుత్వం అజమాయిషీని అప్పగించింది. సత్యమూర్తి నగర్ నుంచి ఒక మార్గం, ఎరుకంజూరీ నుంచి మరో మార్గం నిర్మించి వ్యాసార్పాడి రైల్వే ఫ్లైఓవర్‌తో అనుసంధానం చేయాలని, ఇక్కడి నుండి బేసిన్‌బ్రిడ్జీ మీదుగా దక్షిణ చెన్నైలోకి ప్రవేశించేలా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ధారించారు. ఇందులో సత్యమూర్తి నగర్ నుంచి రైల్వే వోవర్ బ్రిడ్జి వరకు 90 శాతం నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. రైల్వే వోవర్ బ్రిడ్జి నుంచి బేసిన్ బ్రిడ్జి వరకు పనులు పూర్తయ్యాయి. అయితే ఈ రెండింటినీ కలుపుతూ ఎరుకంజేరీ వద్ద బ్రిడ్జి లింక్ పనులు 50 శాతం స్థాయిలో నిలిచిపోయాయి. పిల్లర్ల నిర్మాణ పనుల కోసం ఎరుకంజేరీ హైవై రోడ్డులోని ట్రాఫిక్‌ను అంబేద్కర్ కాలేజీ, ఎంకేపీ నగర్, ములైనగర్ మీదుగా సత్యమూర్తినగర్‌కు మళ్లించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు కారణంగా ప్రజలకు 3 కిలోమీటర్ల దూరం అదనపు భారమైంది.
 
 గడువు పొడిగింపు
 నిర్మాణంలోని జాప్యంపై సంబంధిత అధికారి మీడియాతో మాట్లాడుతూ, పనులు పెండింగ్ పడిన చోట తాగు నీరు, డ్రైనేజీ పైప్‌లైన్ పనులు చేపట్టాల్సి ఉందని, సంబంధిత శాఖ ఇంతవరకు ఈ ఊసేఎత్తడం లేదని చెప్పారు. ఈ పను లు జరగకుండా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేయడానికి లేదని తెలిపారు. అంతేగాక రాష్ట్రంలో ఇసుక వాడకంపై ప్రభుత్వం విధించిన నిషేధం, తద్వారా ఇసుక ధర ఆకాశాన్ని అంట డం మరో అవరోధంగా మారిందని అన్నారు. ఈ కారణాల రీత్యా 2010లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2013 నాటికి పూర్తిచేయలేక పోయామని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం గడువును 2014 మార్చి వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని, ఈలోగా తాగునీరు, డ్రైనేజీ పనులు పూర్తయితేనే రెండవ గడువుకు ఫ్లైఓవర్‌ను ప్రారంభించే దశకు తీసుకురాగలమని అన్నారు.  
 
>
మరిన్ని వార్తలు