రాజపక్సే గో బ్యాక్

9 Dec, 2014 02:28 IST|Sakshi
రాజపక్సే గో బ్యాక్

యుద్ధం పేరుతో ఈలం తమిళుల్ని టార్గెట్ చేసి నరమేధం సృష్టించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుపతి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోనూ, తిరుపతిలోనూ నల్ల జెండాల ప్రదర్శనకు నిర్ణయించాయి. తమిళ ద్రోహి రాజపక్సేను తెలుగు గడ్డపై అడుగు పెట్టనివ్వొద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు నామ్ తమిళర్ కట్ట్చి నేత సీమాన్ విజ్ఞప్తి చేశారు. అడుగు పెట్టనిస్తే చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 
 సాక్షి, చెన్నై : శ్రీలంకలో యుద్ధం పేరుతో సాగిన మారణ కాండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈలం తమిళుల్ని నామరూపాలు లేకుండా చేసిన రాజపక్సేను అంతర్జాతీయ న్యాయ స్థానం బోనులో దోషిగా నిలబెట్టాలన్న కాంక్షతో తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాలు ఉద్యమిస్తున్నాయి. అదే సమయంలో రాజపక్సేను భారత్‌లోకి అనుమతించ కూడదన్న డిమాండ్‌తో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే, ఫలితం శూన్యం. ఓ వైపు రాజపక్సేను పొగడ్తలతో ముంచెత్తే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, మరో వైపు భారత్ పర్యటనకు వచ్చే ఆయనకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలకడం జరుగుతూనే ఉన్నది.
 
 గో బ్యాక్: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజపక్సే తిరుపతికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయ న పర్యటన వివరాల్ని కేంద్రం గోప్యంగా ఉంచినా, చివరి క్షణంలో బయటకు పొక్కింది. దీంతో రాజపక్సే గో బ్యాక్ అన్న నినాదాన్ని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు అందుకున్నాయి. రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడులోనూ, తిరుపతిలోనూ నిరసనలకు నిర్ణయించాయి. ఎండీఎంకే నేత వైగో  ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ నేత మాసిలామణి నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాలతో నిరసనలు తెలిపేందుకు ఓ బృందం సిద్ధమైంది. శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, తదితర తమిళాభిమాన సంఘాలు సైతం రాజపక్సేకు వ్యతిరేకంగా నల్ల జెండాల నిరసనలకు నిర్ణయించాయి. వీసీకే నేత తిరుమావళవన్ ఇచ్చిన పిలుపుతో ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాల ప్రదర్శనకు వ్యూహ రచన చేశారు. రాష్ట్రంలోనూ నిరసలనకు ఆ పార్టీ పిలుపు నివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
 సీమాన్ హెచ్చరిక: నామ్ తమిళర్ కట్చి సైతం నిరసనలకు సిద్ధం అయింది. ఆ పార్టీ నేత సీమాన్ మీడియా తో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. తమిళల మనోభావాల్ని గౌరవిం చాలని విన్నవించారు. తమిళనాడులో తెలుగు వారు, తమిళులు సోదర భావంతో మెలుగుతున్నారని గుర్తు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. తమిళ ఈలంను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆ రాష్ట్రంలోకి అడు గు పెడుతున్నారని, ఆయన్ను అడ్డుకోవాలని కోరారు. తమిళుల్ని యుద్ధం పేరుతో మట్టుబెట్టిన రాజపక్సేను, వారికి అనుకులంగా వ్యవహరించే వారిని తాము క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఒక వేళ రాజపక్సేను అనుమతించిన పక్షంలో చెన్నైలోని టీటీడీ సమాచార కేం ద్రాన్ని ముట్టడిస్తామని, భారీ నిరసనతో తమ ఆగ్రహా న్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు