ఈశాన్యవాసులకు గట్టి భద్రత

15 Feb, 2014 23:42 IST|Sakshi

న్యూఢిల్లీ: నగరంలో ఈశాన్య వాసులపై జరుగుతున్న వరుస దాడులను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు నడుం బిగించారు. ఇటీవల కాలంలో ఈశాన్యరాష్ట్రాల వాసులపై నగరంలో దాడుల పరంపర కొనసాగుతోంది. దీనిపై సాక్షాత్తు రాష్ట్రపతి సైతం విచారం వ్యక్తం చేశారు. అంతేకాక దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వారి భద్రత నిమిత్తం కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేయడంతోపాటు హెల్ప్‌లైన్ నంబర్ (1093)ను ఏర్పాటుచేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ శనివారం తెలిపారు. దీనికోసం కంట్రోల్ రూంలో ఐదు లైన్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు. పోలీసుల సహాయం కోసం 100కు ఫోన్ చేసినట్లే, ఎవరైనా ఈశాన్య వాసులకు ఇబ్బంది ఎదురైతే వెంటనే 1093కి ఫోన్ చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని బస్సీ చెప్పారు. ఈశాన్య విద్యార్థి నిడో తానియా హత్య తర్వాత ఈ చర్యలు తీసుకోవడానికి తాము యోచించినట్లు కమిషనర్ తెలిపారు.
 
 అలాగే హైకోర్టు సైతం ఈశాన్యవాసుల రక్షణార్థం నగరంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినందున దీనికోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశామన్నారు.  ఈ కొత్త విభాగం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన 4వ బెటాలియన్ డీసీపీ కిమ్ కామింగ్ నేతృత్వంలో నానక్‌పురా నుంచి పనిచేస్తుందని చెప్పారు. అతడు జాయింట్ కమిషనర్, చీఫ్ కోఆర్డినేటర్ రాబిన్ హిబూతో కలిసి ఈ విభాగం పనితీరును పర్యవేక్షిస్తారని వివరించారు. ఈ విభాగం జాతీయ రాజధానిలో నివాసముండే ఈశాన్యవాసుల భద్రతకు బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఇంతకుముందు ఢిల్లీ పోలీసులు ఈశాన్య ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు ఏడుగురు నోడల్ అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అన్ని జిల్లాలకు చెందిన డీసీపీలను నోడల్ అధికారులగా గుర్తించేందుకు నిర్ణయించామన్నారు. వీరందరూ స్థానికంగా ఉన్న ఈశాన్యవాసుల సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని, ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్య ఎదురైతే వెంటనే స్పం దిస్తారని కమిషనర్ తెలిపారు.
 
 ద్వారకాలోని ముని ర్కా వంటి ఈశాన్యవాసులు ఎక్కువగా నివసించేప్రాంతాలపై ఇకనుంచి ప్రత్యేక దృష్టి పెడతామని బస్సీ వివరించారు. ఇదిలా ఉండగా, ఈశాన్యవాసుల భద్రత నేపథ్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినట్లుగానే విదేశీయుల కోసం కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని, హెల్ప్‌లైన్ నంబర్  ను ఏర్పాటుచేశామని కమిషనర్ తెలిపారు. ఈ విభాగానికి జాయింట్ కమిషనర్ ముఖేష్ మీనా సంధానకర్తగా వ్యవహరిస్తారన్నారు. సెల్ నంబర్- 08750871111, హెల్ప్‌లైన్-1098 లకు ఆపదలో ఉన్న విదేశీయులెవరైనా ఫోన్ చేస్తే తాము వెంటనే స్పందిస్తామని బస్సీ వివరించారు. నగరంలో ఇటీవల కాలంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ నగరంలో ఉండే ప్రతిఒక్కరికీ రక్షణ కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు కమిషనర్ బి.ఎస్.బస్సీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు