టిక్‌ టాక్‌ ‘రౌడీ బేబీ’

18 Jun, 2020 08:12 IST|Sakshi
రౌడీ బేబి సూర్య అలియాస్‌ సుబ్బలక్ష్మి

క్వారంటైన్‌లోకి వెళ్లనని మొండికేసిన యువతి

సకల వసతుల కల్పనకు డిమాండ్‌ తలొగ్గిన అధికారులు

సాక్షి, చెన్నై : టిక్‌టాక్‌ ద్వారా ఇటీవల కాలంగా సెలబ్రటీలుగా మారిన యువతులు, యువకులు, మహిళలు ఎందరో. వీరిలో రౌడీ బేబీగా తమిళనాట టిక్‌టాక్‌లో వివాదాల కేంద్ర బిందువుగా మారిన సూర్య అలియాస్‌ సుబ్బలక్ష్మి క్వారంటైన్లోకి నెట్టబడింది. తాను వెళ్లబోనంటూ మొండి కేసిన ఆమెను బుజ్జగించడం అధికారులకు శ్రమగా మారింది. చివరకు ఆమె డిమాండ్లకు అంగీకరించి సకల వసతులు కల్పించాల్సి వచ్చింది.(లాడ్జ్‌లో మహిళ హత్య.. యువకునితో వీడియోలపై)

టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఎందరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ అందాలను ఆర బోస్తుంటారు. ఇంకొందరు వివాదాలు, రచ్చ, చర్చ అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ యాప్‌ను మంచికి ఉపయోగించే వాళ్లు ఏ మేరకు ఉన్నా, స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్లు అదేస్థాయిలో ఉన్నారు. ఆ దిశగా తమిళనాటు టిక్‌ టాక్‌ రౌడీ బేబి అంటూ సుర్యా అలియాస్‌ సుబ్బలక్ష్మి  ఆ యాప్‌ను ఉపయోగించే వాళ్లు, చూసే వాళ్లకు సుపరిచితురాలే.  టిక్‌టాక్‌లో ఆమె అందాలను చూసి సింగపూర్‌కు ఆహ్వానించి మర్యాదలు చేసిన వాళ్లూ ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌ ముందుగా ఈ రౌడీ బేబీని సింగపూర్‌కు ఎవరో  సొంత ఖర్చులతో రప్పించుకున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఈ మూడున్నర నెలలు సింగపూర్‌కే పరిమితం అయ్యింది. అక్కడకు వెళ్లినా, టిక్‌టాక్‌ను వదలి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా విదేశాల్లో ఉన్న వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నారు. దీంతో ఈ రౌడీ బేబీని సింగపూర్‌ నుంచి పంపించేశారు. 

క్వారంటైన్లోకి వెళ్లనని పట్టు
సింగపూర్‌ నుంచి మంగళవారం కోయంబత్తూరుకు విమానంలో ఈ బేబీ వచ్చింది. ఆమెను పరిశోధించిన అధికారులు 14 రోజుల స్వీయ నిర్భంధం అంటూ క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, విమానాశ్రయ అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న ఈ సూర్య, తిరుప్పూర్‌ అయ్యం పాళయంలోకి తన ఇంటికి వచ్చేసింది. అది అద్దె ఇల్లు కావడం, ఐదు ఇళ్లకు కామన్‌ బాత్రూం ఉపయోగించాల్సి ఉండడంతో పక్కనే ఉన్న వారిలో ఆందోళన బయలు దేరింది. క్వారంటైన్‌కు తరలించకుండా, ఎలా ఈ రౌడీ బేబీని వదలి పెట్టేశారంటూ పక్కంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులకు ఈ రౌడీబేబీ నుంచి బెదిరింపులు తప్పలేదు.

క్వారంటైన్లోకి వెళ్లాల్సిందేనని అధికారులు ఒత్తిడి తెచ్చినా ఏ మాత్రం ఆమె తగ్గ లేదు. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తారేమో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొని ఉన్నా, ఓ పోలీసు రూపంలో పరిస్థితి మారింది. సూర్యను చూడగానే, రౌడీ బేబీ అంటూ పలకరించడం, కాస్త పొగడ్తల పన్నీరు అద్దడంతో ఆమె మెట్టు దిగింది. ఇక్కడే ఉండి పక్కింటి వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని, క్వారంటైన్లోకి వెళ్లమంటూ ఆయన సూచించడంతో అంగీకరించింది. అయితే, ఆ తర్వాత ఆమె పెట్టిన డిమాండ్‌లు అధికారులకు షాక్‌కు గురి చేశాయి. జీహెచ్‌లో తనకంటూ ప్రత్యేక గది ఉండాలని, టిక్‌ టాక్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తాను పిలిస్తే పలికేందుకు , తనకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సిబ్బంది ఉండాలని డిమాండ్‌ పెట్టగా, పోలీసులు, వైద్య అధికారులు అంగీకరించారు.

మరిన్ని వార్తలు